బోర్డుపై రెండు తెలుగు రాష్ట్రాలకూ మండిపాటేనా?

Update: 2016-12-14 09:04 GMT

ఒక్క విషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాలు రెండూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అదేంటో తెలుసా... కృష్ణా నదీ జలాల బోర్డు నీటి కేటాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేసినా సరే.. దాన్ని వ్యతిరేకించడం! ఆరు ప్రత్యమ్నాయాలను మధించి.. చివరికి ఒక ప్రతిపాదనను ఫైనలైజ్ చేసి.. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి మొర్రో అంటూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాస్తే.. రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ లు కూడా కనీసం పట్టించుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కృష్ణా జలాల విషయంలో సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా పట్టిసీమ విషయంలోనే సమస్య వస్తోంది. పట్టిసీమ నుంచి గోదావరి మిగులు జలాలను ఏపీ అదనంగా వాడుకుంటున్నది గనుక.. అవి కూడా లెక్కకట్టి తమ వాటా పెంచాలని తెలంగాణ వాదిస్తున్నది. అయితే దీనికి ఏపీ సర్కారు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సర్కారు పట్టిసీమను పరిగణనలోకి తీసుకుంటే ఒక రకంగా, తీసుకోకపోతే ఒకరకంగా నీటి కేటాయింపులు చేయాలంటే తమ తరఫున ప్రతిపాదనల్ని బోర్డుకు పంపింది. అందులో కనిష్టంగా తెలంగాణకు 54 టీఎంసీల వరకు రావాలని ప్రతిపాదించింది.

కానీ తెలంగాణ వాదనను తిరస్కరించిన బోర్డు.. ఏపీకి ఎక్కువ వాటా దక్కేలా.. పట్టిసీమను పరిగణనలోకి తీసుకోవడం కూడా కుదరదంటూ కేటాయింపులు చేసింది. తాజాగా ఏపీకి 87 తెలంగాణ కు 43 టీఎంసీలు కేటాయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. రబీసాగుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఈ మధ్యంతర ఉత్తర్వుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్విస్టు ఏంటంటే.. ఇదే తీరుగా కేటాయింపులు ఉంటాయంటూ బోర్డు ఇరు రాష్ట్రాలకుల ముందే లేఖ రాసింది. ఇద్దరూ అసలు స్పందించలేదు. చివరికి తమంతగా బోర్డు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Similar News