విశాఖ ల్యాండ్ స్కాం కేసు లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం ముందు ఉంచింది. విశాఖ భూములు పెద్దయెత్తున ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ లయితే ఈ నివేదికలో మాజీ మంత్రి వైసీపీ నేత ధర్మాన పేరు ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ధర్మాన మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ధర్మాన కుమారుడు విశాఖలో భూఆక్రమణలకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. సిట్ నివేదికపై అధ్యయనం చేసి తదుపరి చర్యలను తీసుకునేందుకు కేబినెట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
గంటా పేరు గల్లంతు...
శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కొందరు రాజకీయనేతలపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. కొందరు పొలీటిషయన్ల పేర్లు కూడా నివేదికలో సిట్ అధికారులు ప్రస్తావించినట్లు చెబుతున్నారు. కొందరు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 300 పేజీల నివేదికను సిట్ కేబినెట్ కు అందించింది. గత పదిహేనుళ్లగా జరిపిన లావాదేవీలపై సిట్ దర్యాప్తు చేసింది. అయితే సిట్ ఏర్పాటుకు ప్రధాన కారణమైన మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మాత్రం ఈ నివేదికలో లేకపోవడం చర్చనీయాంశమైంది. స్వయంగా మరో మంత్రి అయ్యన్న పాత్రుడు గంటా ప్రమేయం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే సిట్ మాత్రం గంటాకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖ భూముల కుంభకోణంలో దర్యాప్తు చేయాలంటూ స్వయంగా ధర్మాన ప్రసాదరావు ఆందోళన చేశారు.