కళ్ళముందే కేరళ కష్టాలు కనపడుతూ ఉండగానే వరుణుడి ప్రకోపానికి తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎడతెరిపి లేని వర్షాలతో నదుల్లో నీరు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తూ ఆందోళన కలిగిస్తుంది. దాంతో రెండు ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. మరోపక్క సురక్షిత ప్రాంతాలకు వర్షాలు, వరదల బాధితులను చేరవేసే ప్రక్రియ ముమ్మరం చేశాయి.
ఆదిలాబాద్ నుంచి ...
తెలంగాణ లోని ఆదిలాబాద్ నుంచి గోదావరి జిల్లాల వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో అల్లాడుతున్నారు. మరోపక్క గోదావరి లంక గ్రామాలు నీట మునిగాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండొవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహించిన గోదావరి కొంత శాంతించింది. దాదాపు పదిలక్షల క్యూసెక్కుల వరదనీరు 175 క్రస్ట్ గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ వర్గాలు.
లంక గ్రామాలు......
ఏటి గట్టు ప్రాంతాల్లో పర్యవేక్షణ ముమ్మరం చేశారు. కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. లంక భూముల్లో వేసిన పంటలు మొత్తం వరదర్పణం అయిపోయాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖ, విజయవాడ పశ్చిమ గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.