వీరి ఆశలను బాబు ఆవిరి చేసేశారా?

Update: 2017-12-05 11:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాట తప్పేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారు. నెల రోజుల క్రితం సరిగ్గా రేవంత్ రెడ్డి రాజీనామా చేసినప్పడు చంద్రబాబు హడావిడిగా హైదరాబాద్ కు వచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యూహాలు తనకు ఉన్నాయని, వ్యూహాలు ఎప్పుడూ బయటకు చెప్పరని కూడా చమత్కరించారు. అంతేకాదు గుప్పిట మూసి ఉంచితేనే అది రహస్యమని... తెరిస్తే ఏముంటుందని కూడా అన్నారు. దీంతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు అమితానందపడ్డారు. అధినేత ఏదో చేయబోతున్నారని, తమ రాజకీయ భవిష్యత్ కు ఢోకా ఉండదని ఆనందపడ్డారు. అంతేకాదు ప్రతి నెల తాను వచ్చి నేతలతో, కార్యకర్తలతో సమావేశమవుతానని మాట ఇచ్చారు. ఎప్పటికప్పుడు వ్యూహరచన చేసుకుంటూ ముందుకు వెళ్లి పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తెద్దామన్నారు. ఈ సంఘటన జరిగింది నవంబర్ 2వ తేదీన.

కాలక్షేపమే కాని.... కార్యాచరణ ఏదీ?

కాని ఆరోజు నుంచి ఈరోజు వరకూ నెల దాటిపోయాని చంద్రబాబు మళ్లీ తెలంగాణ టీడీపీ గురించి ఆలోచించను కూడా లేదంటున్నారు ఇక్కడి తమ్ముళ్లు. కనీసం ఇక్కడకు వచ్చి తమను కలుస్తామని చెప్పినా అది జరగక పోగా, అమరావతిలో కూడా తమకు అపాయింట్ మెంట్ దొరకడం లేదని మధనపడుతున్నారు సీనియర్ నేతలు. ఇక సెంట్రల్ పార్టీ కార్యాలయం కూడా అమరావతికి తరలి పోతుండటంతో ఇక చంద్రబాబు పూర్తిగా టీటీడీపీని వదిలేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వరుస తలెత్తుతున్న సమస్యలు కూడా చంద్రబాబుకు ఊపిరి సలపనివ్వడం లేదు. జగన్ పాదయాత్ర ఒకవైపు జరుగుతుండగా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుండటం, కేంద్రం నుంచి నిధులు రాకపోతుండటంతో చంద్రబాబు తెలంగాణ పార్టీని పూర్తిగా మర్చిపోయారంటున్నారు. ఇక కొడంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్న తెలంగాణ టీడీపీ నేతలు కూడా దాన్ని మర్చిపోయినట్లున్నారు. ఇప్పుడు ఇక్కడ నేతలు కాలక్షేపానికి పార్టీ కార్యాలయానికి రావడం తప్ప కార్యాచరణ ఏమీ చేపట్టడం లేదన్నది వాస్తవం. మొత్తం మీద చంద్రబాబు మీద తెలంగాణ తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు ఆవిరయిపోయినట్లేనా?

Similar News