నేడు మూడోసారి శాంతి చర్చలు
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య శాంతి చర్చలు నేడు జరగనున్నాయి. ఈ చర్చలు ఫలప్రదం అవుతాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య శాంతి చర్చలు నేడు జరగనున్నాయి. మూడో దశలో జరగనున్న ఈ చర్చలు ఫలప్రదం అవుతాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈరోజు జరిగే చర్చలలో యుద్ధాన్ని విరమించాలని ఉక్రెయిన్, నాటో సభ్యత్వాన్ని స్వీకరించకూడదని రష్యా షరతులు విధిస్తాయి. గత రెండు సార్లు బెలారస్ లో జరిగిన సమావేశాల్లోనూ ఇదే జరిగింది. చర్చలు ఫలవంతం కాలేదు. ఈసారి షరతులు లేకుండా పౌర ప్రయోజనాల కోసం చర్చలు జరపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.
పుతిన్ హెచ్చరికలతో....
మరో వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుద్ధాన్ని విరమించేది లేదని చెబుతున్నారు. తమను రెచ్చగొట్టవద్దని పుతిన్ ప్రపంచ దేశాలను సయితం హెచ్చరించారు. ఉక్రెయిన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి చర్చలు ఏ మేరకు సఫలమవుతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యుద్ధం మాత్రం భీకరంగా ఇరు దేశాల మధ్య జరుగుతూనే ఉంది.