Ukraine War : ఉక్రెయిన్ పై యుద్ధం... పుతిన్ వ్యూహమదే
ఉక్రెయిన్ పై యుద్ధం చేయాలన్న వ్యూహంతోనే తొలి నుంచి రష్యా ఉంది. యుద్ధం ఆలోచనతోనే సైనికులను మొహరించింది.
ఉక్రెయిన్ పై యుద్ధం చేయాలన్న వ్యూహంతోనే తొలి నుంచి రష్యా ఉంది. యుద్ధం ఆలోచనతోనే సైనికులను మొహరించింది. అందుకే పుతిన్ చర్చలకు కూడా సిద్ధపడలేదు. ప్రపంచ దేశాల అభ్యర్థనను కూడా సున్నితంగా కాదు. కఠినంగానే తిరస్కరించారు. రష్యా అందుకే తొలుత ఉక్రెయిన్ పై సైబర్ దాడికి దిగింది. సైబర్ దాడితో ఉక్రెయిన్ ఆనుపానులను కనుగొనింది. ఉక్రెయిన్ పై ఎక్కడెక్కడ దాడులు చేయాలన్నది సైబర్ దాడుల ద్వారా ముందుగానే నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.
మూడు మార్గాల్లో....
మూడు మార్గాల్లో ఉక్రెయిన్ ను ఆక్రమించడానికి రష్యా తొలి నుంచి ప్లాన్ చేసుకుంది. ఆ మూడు మార్గాల్లో తమ సైనికులను రష్యా ముందునుంచే మొహరించింది. ఉక్రెయిన్ తూర్పు, ఉత్తర, పశ్చిమ భాగాల నుంచి రష్యా దాడులకు దిగాలని ముందుగానే యుద్ధ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. తూర్పు భాగంలోని లుహాన్స్క్, దొనెట్క్స్ ఉత్తర ప్రాంతంలోని బెలారస్ ద్వారా దాడులకు దిగనుంది. పశ్చిమ ప్రాంతంలోని ఒడెసా నుంచి దాడులకు దిగే అవకాశముంది.
ప్రణాళిక ప్రకారం...
రష్యా ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చింది. మూడు మార్గాల్లో సైనికులతో పాటు అన్ని రకాల యుద్ధ సామాగ్రిని చేరవేసుకుంది. తొలి నుంచి యుద్ధం అనివార్యం అని ప్రపంచ దేశాధి నేతలు చెబుతున్నారు. అయినా యుద్ధ నివారణ కోసం చేపట్టిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కేవలం సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే ఉద్దేశ్యం లేదని ఆయన చెప్పారు. వేర్పాటు వాద ప్రాంతాల్లో పౌరుల రక్షణకు మాత్రమే ఆపరేషన్ ప్రారంభించామని పుతిన్ తెలిపారు.
ధీటుగా సమాధానమిస్తున్న....
కాగా ఉక్రెయిన్ ప్రతిఘటన ధీటుగా చేస్తుంది. ఇప్పటికే రష్యాకు చెందిన ఐదు ఫైటర్ జెట్స్ ను కూల్చి వేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. తాము ధీటుగా రష్యా దాడులను తిప్పికొడుతున్నామని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యాపై యుద్ధంలో విజయం సాధిస్తామని ఉక్రెయిన్ ధీమా వ్యక్తం చేసింది. దేశంలో మార్షల్ లా విధించినట్లు తెలిపింది.