Ukraine War : కెమెడియన్ కాదు... జనం గుండెల్లో హీరో

ఉక్రెయిన్ అధ్యక‌్షుడు జెలెన్ స్కీ తన కుటుంబంతో సహా కీవ్ లోనే ఉంటూ దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపుతున్నాడు

Update: 2022-02-26 07:57 GMT

దేనికైనా గుండె ధైర్యం కావాలి. ఎదురొడ్డి పోరాడాలంటే పిడికెడంత గుండెతో పాటు ఒంటినిండా దేశభక్తి ఉండాలి. ఈ రెండు పుష్కలంగా ఉన్న వ్యక్తి జెలెన్ స్కీ. అవును... ఆయన దేశం విడిచి వెళ్లాలనుకుంటే క్షణం సేపు పట్టదు. సరిహద్దుల్లో అమెరికా సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. తన కుటుంబంతో సహా ఆ విమానాలు ఎక్కేసి ఎంచక్కా అమెరికా వెళ్లొచ్చు. కానీ జెలెన్ స్కీ అలా చేయలేదు. కుటుంబంతో సహా కీవ్ లోనే ఉంటూ దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపుతున్నాడు.

ఆత్మవిశ్వాసంతో.....
సైనిక దుస్తులను ధరించి స్వయంగా యుద్ధంలో పాల్గొంటున్నారు. రష్యన్ సేనలు తమను ఏమీ చేయలేవని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. నిజానికి రష్యా బలగాలు, ఆయుధ సంపత్తితో పోలిస్తే ఉక్రెయిన్ దేనికీ సరిపోదు. కానీ ఆ దేశ ప్రజల్లో ఉన్న దేశభక్తి, గుండెల నిండా ఉన్న ధైర్యమే రష్యన్ సైనికులను అడుగడుగునా అడ్డుకుంటుంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి రష్యన్ సైనికులపై పెట్రో బాంబులతో దాడి చేస్తున్నారంటే ఎంతకు తెగించారో అర్థమవుతుంది.
తెగింపు రావడానికి...
ప్రజల్లో ఈ రకమైన తెగింపు రావడానికి కారణం జెలెన్ స్కీయే కారణమని చెప్పక తప్పదు. యుద్ధంలో గెలుపోటములను ఎవరూ చెప్పలేం. ఊహించ వచ్చు. కొందరి దేశాధ్యక్షులులాగా యుద్ధం ప్రారంభమయిన వెంటనే దేశాన్ని విడిచి వెళ్లేందుకు జెలెన్ స్కీ ఇష్టపడట లేదంటే ఆయనకు దేశంపై ఉన్న అపార ప్రేమ చెప్పకనే తెలుస్తుంది. మొక్కవోని ధైర్యంతో రష్యన్ సైనికులకు ఎదురొడ్డి నిలవాలని తరచూ వీడియో సందేశాలను విడుదల చేస్తూ జెలెన్ స్కీ ప్రజలను, సైనికులను ఉత్సాహపరుస్తున్నారు.
ప్రజల గుండెల్లో నిలిచేలా....
నిజానికి జెలెన్ స్కీ.. ఒక కెమెడియన్. కెమెడియన్ గా ఆయన ఉక్రెయిన్ వాసులందరినీ అలరించారు. అందరినీ నవ్విస్తూ రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన జెలెన్ స్కీ ఇలాంటి విషాద దృశ్యాలను చూస్తానని ఊహించి ఉండరు. అందుకే ఆయన ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల గుండెల్లో కెెమెడియన్ కాదు. ఒక హీరో. అవును అంతే. ఉక్రెయిన్ ఓడినా, గెలిచినా చరిత్రలో జెలెన్ స్కీ ప్రస్థానాన్ని మాత్రం ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News