Onion Price : కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. ఇక ధరలు మరింత పెరుగుతాయామో?
ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలోనే ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి
ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలోనే ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. మొన్నటి వరకూ టమాటా ధరలు చుక్కలుచూపించగా, ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి లేకుండా వంటింట్లో పని జరగదు. ఉల్లిపాయ లేకుండా ఏవంట చేయడం కుదరదు. తల్లి చేయని ఉపయోగం ఉల్లి చేస్తుందన్న సామెతగా ఉంటుంది. ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ కిలో ఇరవై నుంచి ముప్పయి రూపాయలు పలికిన కిలో ఉల్లి ధర ఇప్పుడు యాభై రూపాయలకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు.
దిగుబడి తగ్గడంతో....
సాధారణంగా ఉల్లిపాయల ధరలు సెప్టంబరు నుంచి పెరుగుతుంటాయి. కానీ ఒకనెల ముందుగానే షాకిస్తుంది. మహారాష్ట్రలో ఉల్లిపంట దెబ్బ తినడంతో పాటు దిగుమతి కూడా తగ్గింది. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఉల్లిసాగు ఎక్కువగా ఉంటుంది. కానీ ఏటా 30 వేల హెక్టార్లల పండే ఉల్లి ఈసారి తొమ్మిది వేల హెక్టార్లకే పరిమితమయ్యింది. వర్షాలు లేకపోవడం వల్లనే ఉల్లి దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు ఉల్లి మార్కెట్ లో క్వింటాల్ ధర మూడు వేల రూపాయల ఐదు వందల రూపాయల వరకూ పలుకుతుంది. రైతులు తమ పంటలకు మంచి ధర లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ వినియోగదారులు మాత్రం ఉల్లి ధరలను చూసి లబోదిబో మంటున్నారు.