ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రెండ్రోజులు వర్షసూచన !
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, సోమవారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ
విశాఖపట్నం : కొద్దిరోజులుగా మండుటెండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, సోమవారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఏపీకి సుమారు 1300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో.. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉండకపోవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండవచ్చని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో మార్చి 21, 22 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో చల్లని గాలులు వీయవచ్చని అంచనా. రెండ్రోజులు రాష్ట్రం చల్లబడినా.. ఆ తర్వాత వేడిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని తెలిపారు.