చేయని నేరానికి జైలా?
చంద్రబాబు పట్ల సీఐడీ అధికారులు దారుణంగా వ్యవహరించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు
చంద్రబాబు పట్ల సీఐడీ అధికారులు దారుణంగా వ్యవహరించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారు. ఒక నిర్దోషిని అకారణంగా జైలుకు పంపడం న్యాయమా? అని యనమల ప్రశ్నించారు. జగన్ లండన్ కు వెళ్లి సీఐడీ ద్వారా చంద్రబాబును అరెస్ట్ చేయించారన్నారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే అందుకు జగన్, వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని యనమల హెచ్చరించారు. చేయని నేరానికి జైలుకు పంపారన్నారు.
పెట్టుబడులు ఎలా వస్తాయి?
జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే భవిష్యత్ లో ఏపీకి ఎటువంటి పెట్టుబడులు రావని యనమల అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వల్ల ఏపీకి గతంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. చేయని నేరానికి చంద్రబాబు ను జైల్లో పెట్టారన్నారు. జగన్ జీవిత చరిత్ర చూసే తాము ఆర్థిక నేరస్థుడని అంటున్నామని అన్నారు. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి తన ఆస్తులను పెంచుకోవడం కోసమే జగన్ తాపత్రయపడుతున్నారని తెలిపారు.
నాలుగున్నరేళ్లుగా...
ప్రజల ఆస్తులను దోచిన వారిని శిక్షించకుండా మేలు చేసిన వారిని జైలుకు పంపడమేంటని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇలాగే ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష‌్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు ఏమీ దొరకవని అన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఏపీని జగన్ దోచేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చరిత్ర మరిచిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. త్వరలోనే జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు.