బాబుకు ఎంత కష్టం?

వినాయక చవితి పండగను టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే జరుపుకోవాల్సిన పరిస్థిితి ఏర్పడింది.

Update: 2023-09-13 06:25 GMT

వినాయక చవితి పండగను టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే జరుపుకోవాల్సిన పరిస్థిితి ఏర్పడింది. ఈ నెల 19వ తేదీ వరకూ క్వాష్ పిటీషన్ ను హైకోర్టు వాయిదా వేయడంతో ఆయన వచ్చే మంగళవారం వరకూ రాజమండ్రి జైలులోనే ఉండాల్సి వస్తుంది. ఈ నెల 18వ తేదీన వినాయక చవితి పండగ. అయితే చంద్రబాబు అప్పటి వరకూ జైలులోనే ఉండాల్సి వస్తుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో నాలుగు రోజుల నుంచి చంద్రబాబు రాజమండ్రి జైలులోనే ఉన్నారు.

9న అరెస్ట్ అయి...
ఈ నెల 9వ తేదీన స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన నంద్యాల పర్యటనలో ఉండగా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను తీసుకు వచ్చి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నెల 22వ తేదీ వరకూ చంద్రబాబుకు ఈ కేసులో ఏసీబీ న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఈ నెల 10వ తేదీ రాత్రి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి భోజనం, మందులు తెప్పించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆయన వద్ద ఐదుగురు భద్రతా సిబ్బందితో పాటు ఒక సహాయకుడు కూడా ఉండేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది.
పిటీషన్ వాయిదా వేయడంతో...
చంద్రబాబు ఈ కేసు నుంచి బయటకు వెంటనే వస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు భావించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇక్కడే మకాం వేసి చంద్రబాబు కేసుకు సంబంధించి న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్నారు. ఆయన వేసిన క్వాష్ పిటీషన్ హైకోర్టు వాయిదా వేయడంతో వినాయక చవితి వరకూ చంద్రబాబు జైలులోనే ఉండాల్సి వస్తుంది. తన 73 ఏళ్ల జీవితంలో తొలిసారి వినాయక చవితి పండగను చంద్రబాబు జైలులో జరుపుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వివిధ రూపాల్లో తెలియజేస్తున్నాయి. వచ్చే మంగళవారానికి చంద్రబాబు జైలుకు వెళ్లి దాదాపు పది రోజులవుతుంది.


Tags:    

Similar News