జీజీహెచ్ లో పేషంట్ల మరణాలపై అధికారుల వివరణ ఇదే..

ఆసుపత్రిలో వైద్యులు సరిగ్గా పట్టించుకోవడం లేదని, వైద్య పరికరాలు పనిచేయకే తమవారు చనిపోయారని..

Update: 2023-07-22 14:45 GMT

Nellore GGH

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో MICU వార్డులో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా ఆరుగురు పేషంట్లు చనిపోవడం కలకలం రేపింది. దాంతో పేషంట్ల బంధువులు.. ఆక్సిజన్ అందకే తమ వారు ప్రాణాలు కోల్పోయారంటూ ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో వైద్యులు సరిగ్గా పట్టించుకోవడం లేదని, వైద్య పరికరాలు పనిచేయకే తమవారు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సుమారు రెండు గంటల సేపు ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాని కారణంగానే ఆక్సిజన్ అందక రోగులు చనిపోయారన్నది బంధువుల ఆరోపణ. ఆ ఆరోపణలను సూపరింటెండెంట్ సిద్ధానాయక్ ఖండించారు. కరెంటు సరఫరాకు ఆక్సిజన్ కు అసలు సంబంధమే లేదన్నారు.

కరెంట్ ఉన్నా, లేకపోయినా ఆక్సిజన్ పైపు ద్వారా పేషెంట్ కు సరఫరా అవుతుందన్నారు. చనిపోయిన వారిలో ఎవరూ వెంటిలేటర్ పై లేరన్నారు. తాజాగా ఈ ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. జీజీహెచ్ లో MICU వార్డులో పేషంట్లు అనారోగ్య కారణాలతోనే మరణించారని స్పష్టం చేశారు. MICU వార్డులో ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి లోపం లేదన్నారు. మరణించిన పేషంట్లలో ఎవరూ వెంటిలేటర్ పై లేరని డాక్టర్ పెంచలయ్య తెలిపారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు.




Tags:    

Similar News