ఏపీలో సమగ్ర ఓటరు సర్వే.. జరగనున్న మార్పులు ఇవే
అలాగే.. ఓటర్ల జాబితా డబుల్ ఎంట్రీలు, నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పై బడిన వారిని..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జులై 21 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 21 వరకు ఇంటింటికీ బూత్ లెవల్ అధికారులు ఈ సర్వే నిర్వహిస్తారని.. సర్వేలో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్క పౌరుడికి ఓటుహక్కు కలిగేలా చూడటమే ప్రధాన లక్ష్యమన్నారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండనున్న వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు.
అలాగే.. ఓటర్ల జాబితా డబుల్ ఎంట్రీలు, నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పై బడిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం, డోర్ నంబర్లు లేని, ఒకే డోర్ నంబరు పై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు పరిశీలన, సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల వివరాలను సరిచేయడం వంటివి ఈ సర్వేలో బీఎల్ఓలు చేస్తారన్నారు. దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు వారి ఓట్లను ఆయా ప్రాంతాల జాబితాలో చేర్చడంతో పాటు.. ఒక పోలింగ్ బూత్ లో 1500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ కు సిఫార్సు చేయడం, పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడం, తప్పొప్పులను సరిచేయడం వంటి వాటిని నిర్వహిస్తారని వివరించారు.
ఓటర్ల జాబితాలో ఓటర్లు తమ ఓటును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకునే అవకాశం కూడా ఈ సర్వేలో ఉంటుందన్నారు. నియోజకవర్గం మారినా, ఓటరు జాబితాలో పేర్లు లేకపోయినా, తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఉందని ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఓటు ఉండి గుర్తింపు కార్డులు లేనివారికి వాటిని జారీ చేస్తామన్నారు. ఆగస్టు 21 వరకూ రాష్ట్రంలో ఇంటింటికీ బూత్ లెవల్ సర్వే, అక్టోబర్ 17న ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రచురణ, నవంబర్ 30 వరకు వాటిపై క్లెయిమ్ లు, అభ్యంతరాలు నవంబరు 30 వరకు స్వీకరణ ఉంటుందన్నారు. ఓటర్ల తుది జాబితాను 2024, జనవరి 5న ప్రచురిస్తామని తెలిపారు.