కుంగిన మూడంతస్థుల భవనం
కడప జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక భవనం భూమిలో కుంగిపోయింది.
కడప జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక భవనం భూమిలో కుంగిపోయింది. కడప పట్టణంలోని కో-ఆపరేటివ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. మూడంతస్థుల భవనం కుంగిపోయిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భవనం పురాతనమైనది కావడంతో యజమాని దానికి మరమ్మతులు చేస్తున్నారు. ఇందుకోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న వారిని ఇంటి యజమాని వెంకటరామరాజు ఖాళీ చేయించారు.
ప్రాణనష్టం మాత్రం....
మొదటి అంతస్తులో ఒక కుటుంబం అద్దెకు ఉంటుంది. భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. వీరు మాత్రం ఖాళీ చేయకుండా ఉన్నారు. రెండో అంతస్థులో మరో కుటుంబం వారి ఇద్దరు పిల్లలతో కలసి ఉంటుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా భూమిలోకి భవనం కుంగిపోవడంతో మొదటి, రెండో అంతస్థులో ఉన్న వారు కేకలు పెట్టారు. దీంతో స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిప్రమాద శాఖ సిబ్బంది, పోలీసులు వచ్చి మొదటి అంతస్థులో చిక్కుకుపోయిన సుదర్శనరాజు కుటుంబ సభ్యులను రక్షించారు. ఎటుంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.