రాజధాని అమరావతిపై నేడు సుప్రీంలో విచారణ
రాజధాని అమరావతి కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.;
రాజధాని అమరావతి కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈ పిటీషన్ వేసింది.
హైకోర్టు తీర్పుపై...
దీంతో హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందా? రాదా? అన్న ఉత్కంఠ నెలకొంది. తాము రద్దు చేసిన చట్టాలపై హైకోర్టు ఈ తీర్పు వెలువరించిందని ఏపీ ప్రభుత్వం వాదించనుంది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సరికాదని పిటీషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వానికి రాజధాని ఏదనేది నిర్ణయించుకునే అధికారం ఉందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రాజధాని ఏర్పాటు కోసం నియమించిన కమిటీల సిఫార్సులను కూడా హైకోర్టు పట్టించుకోలేదని పేర్కొంది. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుందని ప్రభుత్వం వాదించనుంది. దీనిపై ఈరోజు విచారణ జరిగే అవకాశముంది.