అరుదైన బ్రాహ్మీ విగ్రహం!

శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం, అంగూరు గ్రామ శివారులోని కోనేరు పక్కన నిర్లక్ష్యంగా పడి ఉన్న వెయ్యేళ్ల నాటి అరుదైన బ్రాహ్మీ విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు.;

Update: 2024-10-09 16:17 GMT

ఆలనాపాలనా లేని వెయ్యేళ్లనాటి

అరుదైన శిల్పానికి ఆదరణ కరువు

-కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి

శ్రీకాకుళం, అక్టోబర్‌, 9: శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం, అంగూరు గ్రామ శివారులోని కోనేరు పక్కన నిర్లక్ష్యంగా పడి ఉన్న వెయ్యేళ్ల నాటి అరుదైన బ్రాహ్మీ విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. జిల్లా పర్యాటకాధికారి, నారాయణరావు గ్రామంలోని శివాలయం కోనేరు ప్రక్కన ఈ విగ్రహాన్ని గుర్తించారని, ఆయన ఇచ్చిన సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాన్ని పరిశీలించి వివరాలందించారు.

చెవులకు కుండలాలు, కంఠహారం, చంద్రహారం, బాహువలయాలు, కంకణాలు, కడియాలతో అలంకరించబడిన బ్రాహ్మీ (బ్రహ్మ భార్య), రెండు చేతులతో వీణను వాయిస్తున్నట్లుగానూ, కుడి కాలు వద్ద, ఆమె వాహనం హంసతోనూ, ఆమెకు ఎడమవైపున, బ్రాహ్మీవైపు చూస్తూ, ఉత్కుటికాసనంలో కూర్చున్న చాముండి, వాహనంతో మలచబడి ఉన్నాయని, ఈ విగ్రహాలు, తూర్పుగాంగుల కాలంలో జనాదరణ చవిచూచిన సప్తమాతృకారాధనను సూచిస్తున్నాయనీ, సాధారణంగా బ్రాహ్మీ విగ్రహం అక్షమాల, పుస్తకంతో మలచబడతాయనీ, ఈ బ్రాహ్మీ విగ్రహం మాత్రం సరస్వతి రూపాన్ని ప్రతిబింబిస్తూ, వీణను మీటుతూ, హంసవాహినిగా చెక్కబడి ప్రత్యేకతను సంతరించుకొందని శివనాగిరెడ్డి అన్నారు.

నాలుగు అడుగుల ఎత్తు, అంతే వెడల్పున్న ఎర్రరాతిపై సుఖాసనంలో కూర్చున్న, సప్తమాతల (ఏడుగురు అక్క చెల్లెళ్ల) శిల్ప సముదాయంలోని బ్రాహ్మీ, చాముండి విగ్రహాలు, తలలు, కాళ్ల వద్ద భిన్నమై ఉన్నాయని, శిల్పకళాశైలి ననుసరించి, ఈ విగ్రహాలు తూర్పుగాంగుల కాలాని (క్రీ.శ.10 శతాబ్ది)కి చెందినవని, చారిత్రక ప్రాధాన్యతగల ఈ విగ్రహాలను శివాలయ ప్రాంగణంలోకి తరలించి భద్రపరచి, భావితరాలకు అందించాలని అంగూరు గ్రామ ప్రజలకు శివనాగిరెడ్డి, నారాయణరావు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News