పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధి.. 1000కి పైగా పందులు మృతి
మేత కోసం వెళ్లిన పందులు ఎక్కడపడితే అక్కడ పడి చనిపోయి కనిపించాయి. భారీ సంఖ్యలో పందులు మరణించడంతో..
జంతువులలో ఎప్పుడూ ఏదొక వ్యాధి సంభవిస్తూనే ఉంటోంది. బర్డ్ ఫ్లూ, లంపీ వైరస్ లతో సతమతమవుతోన్న సమయంలో.. మరో అంతుచిక్కని వ్యాధి బయటపడింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 15 రోజుల్లో 1000కి పైగా వరహాలు (పందులు) అంతుచిక్కని వ్యాధి బారినపడి మరణించాయి. స్థానిక తిరుపతమ్మ దేవాలయం దిగువ ప్రాంతంలో కొందరు పందుల పెంపకం సాగిస్తున్నారు. అవి మునేరు పరిసర ప్రాంతాలవైపు మేతకు వెళ్లి.. తిరిగి రాకపోవడంతో.. వాటిని వెతికేందుకు పెంపకం దారులు వెళ్లారు.
మేత కోసం వెళ్లిన పందులు ఎక్కడపడితే అక్కడ పడి చనిపోయి కనిపించాయి. భారీ సంఖ్యలో పందులు మరణించడంతో పెంపకం దారులకు లక్షల్లో నష్టం జరిగిందని వాపోతున్నారు. అధికారులకు సమాచారమివ్వగా.. వాటి నమూనాలను సేకరించేందుకు వీలుపడలేదు. పందులు చనిపోయి కుళ్లిపోవడంతో నమూనాలను సేకరించడం వీలుకాదని పశువైద్యులు తెలిపారు. అయితే వాటికి పెట్టే ఆహారం, నీళ్లను మార్చాలని పెంపకం దారులకు సూచించారు.