ఏపీలో ఏసీబీ దాడులు.. లక్షల్లో నగదు స్వాధీనం
ఆయన కారులో లక్షనాలుగు వేల నగదు దొరకగా.. అందుకు తగిన వివరాలు లేకపోవడంతో ఆ సొమ్మును అవినీతి సొమ్ముగా..
ఏపీలో ఏసీబీ అధికారులు..అవినీతి అధికారులపై దాడులు నిర్వహించారు. వివిధ జిల్లాల్లోని సబ్ రిజిస్టర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ లక్షల్లో నగదు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు అవినీతి అధికారులను కూడా అదుపులోకి తీసుకుందు. 14400కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ తనిఖీలు నిర్వహించింది.
గుంటూరు, విజయనగరం, వైఎస్సార్ కడప, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లోని సబ్ రిజిస్టర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ గుజ్జర్లపూడి కరుణకుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన కారులో లక్షనాలుగు వేల నగదు దొరకగా.. అందుకు తగిన వివరాలు లేకపోవడంతో ఆ సొమ్మును అవినీతి సొమ్ముగా భావించి కేసు నమోదు చేశారు. అలాగే విజయనగం జిల్లా తెర్లాం మండల హౌసింగ్ ఏఈ మత్స వెంకటేశ్వరరావుపై కూడా అవినీతి కేసు నమోదైంది. కాలమరాజు పేట గ్రామానికి చెందిన ఇప్పిలి రామకృష్ణకు జగనన్న ఇల్లు మంజూరవ్వగా.. ఇంటికి బిల్లు చెల్లించేందుకు హౌసింగ్ ఏఈ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో రామకృష్ణ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ రామకృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముగ్గురు వ్యక్తులు అనధికారికంగా పనిచేస్తూ.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక దాడులు చేసి సిబ్బంది వద్ద రూ.50 వేలు స్వాధీనం చేసుకుంది. అలాగే అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ కు డ్రైవర్ గా పనిచేస్తున్న ఇస్మాయిల్ నుంచి సరైనఆధారాలు లేని రూ.2.27 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.