Tirumala : తిరుమలలో వసతి గృహాల అద్దెకు నగదు ఎందుకు తీసుకోకూడదు ఈవో గారూ?

తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రక్షాళన ప్రారంభమయింది.

Update: 2024-07-02 07:57 GMT

తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రక్షాళన ప్రారంభమయింది. ఇప్పటికే దివ్యదర్శనం టోకెన్లు తిరిగి ప్రారంభించారు. లడ్డూల నాణ్యత పెంచాలని టీటీడీ ఈవో నిర్ణయించారు. భక్తులకు తరిగొండ వెంగమాంబ అన్న దాన సత్రంలోనూ ఆహారంలో నాణ్యతను పెంచాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు. ఇవన్నీ ఇలా ఉంటే భక్తులు మరో కోరిక గట్టిగా కోరుతున్నారు. వసతి గృహాలను అద్దెకు తీసుకుంటే కేవలం డెబిట్ కార్డు ద్వారానే తీసుకునే విధానాన్ని గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిందంటున్నారు.

అడ్వాన్స్ సొమ్మును...
ఒకరోజు గదిలో ఉన్నా అడ్వాన్స్ గా రెండు రోజులకు సరిపడా అడ్వాన్స్ డెబిట్ కార్డు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వసూలు చేస్తుంది. అయితే గదిని ఖాళీ చేసేటప్పుడు అడ్వాన్స్ గా భక్తుల వద్ద తీసుకున్న డబ్బు గతంలో నగదు రూపంలో చెల్లించేవారు. అయితే గత ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని చెబుతుంది. అయితే ఆ డబ్బు తమ ఖాతాల్లో జమ కావడం లేదని అనేక మంది భక్తులు ఆరోపిస్తున్నారు. తిరిగి నగదు రూపంలోనే వసతి గృహాల అద్దె తీసుకుని, ఖాళీ చేసే సమయంలో నగదు రూపంలోనే చెల్లించాలని భక్తులు కోరుతున్నారు.
తిరిగి చెల్లించడం లేదని...
నగదు కోసం టోల్ ఫ్రీ ఫోన్ నెంబరు పెట్టినా సరైన సమాధానం తమకు లభించడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా వసతి గృహాలను అద్దెకు తీసుకునేటప్పుడు నగదు రూపంలో చెల్లించేలా గతంలో ఉన్న విధానాన్ని అనుసరించాలని, తిరిగి ఖాళీ చేసేటప్పుడు అడ్వాన్స్ నగదును చెల్లించాలని కోరుతున్నారు. అలా చెల్లించనప్పుడే పారదర్శకత ఉంటుందని, భక్తుల్లో మరింత విశ్వాసం ఉంటుందని ఎక్కువ మంది భక్తులు వినతి చేస్తున్నారు. టీటీడీ ఈవో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.


Tags:    

Similar News