Andhra Pradesh : ఏపీ ప్రజలకు మరో "షాక్" తగలనుందా? జేబులకు చిల్లు పడుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత విద్యుత్తు ఛార్జీలు పెరిగాయి. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు

Update: 2024-12-06 03:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత విద్యుత్తు ఛార్జీలు పెరిగాయి. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగానే ఈ ఛార్జీల పెంపుదల అంటూ కొంత నచ్చచెప్పే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తుంది. మరోవైపు అదనపు ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీల వడ్డనను నిలుపుదల చేయాలంటూ వామపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇటు కూడా వైసీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రజలు కూడా పలు చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం, జెన్ కో, ట్రాన్స్ కోలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కారణంగానే ఆ పాపం ఇప్పుడు ప్రజలను వెంటాడుతుందని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెబుతున్నారు.

స్మార్ట్ మీటర్లను ఏర్పాటుకు...
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై మరింత స్పష్టతను ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్మార్ట్ మీటర్లపై విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇక మీటర్‌కి రీఛార్జ్ చేసుకుంటేనే విద్యుత్తు సరఫరా వస్తుందని, లేకపోతే బల్బు కూడా వెలగదంటూ ప్రచారం ఊపందుకుంది. దీనిపై అధికారులు కాని, ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడంతో ఏపీలో స్మార్ట్ మీటర్ల ప్రక్రియను ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది. అసలే ధరలు పెరగడం.. మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో నెలవారీ బిల్లు ఎంత వస్తుందోనన్న బెంగ ఏపీ ప్రజల్లో నెలకొంది.
తొలి మీటరు విశాఖలో...
రాష్ట్రంలో తొలి సారి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. తర్వాత రాష్ట్రం మొత్తం అమలులో తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తోంది.రీఛార్జ్ చేయకపోతే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్ గా నిలిచిపోతుంది. తిరిగి మనకు అవసరమైనంత మేర రీ ఛార్జ్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహలకు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. నంద్యాలలో కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ మీటర్‌కు మనం ముందుగానే రీఛార్జి చేసుకోవాలి.
బ్యాలెన్స్ ఉన్నత వరకు...
అందులో బ్యాలెన్స్ ఉన్నత వరకు ఈ స్మార్ట్ మీటర్ నుండి కరెంట్ మన ఇంటికి వస్తుంది. తర్వాత నిర్దాక్షిణ్యంగా కట్ అయిపోతుంది. మన మొబైల్ ఫోన్ కు, డిష్ టీవీ కి ఎలా నెలవారీ రీఛార్జి చేసుకుంటమో అలాగే స్మార్ట్ మీటర్ పెడితే విద్యుత్తు కూడా అదేవిధంగా రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ ఎంత వినియోగించింది? వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుందని అంటున్నారు. ఆన్‌లైన్‌లో రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద స్మార్ట్ మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తెస్తే విద్యుత్తు దుర్వినియోగం జరగదు అన్నది మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News