Ys Jagan : అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది.. కోల్పోగానే చెడు అయ్యారా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్ అన్నారు. జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్ అన్నారు. జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ ఫొటోతోనే తాము గెలిచామని చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి 151 స్థానాల్లో గెలిచిందంటే అది జగన్ వల్లే సాధ్యమయిందని పొగడ్తల మీద పొగడ్తలు చేశారు. 2019 ఎన్నికల్లో తమకు వైసీపీ టిక్కెట్ వస్తే చాలు అనుకున్నారు. తాము గెలిచినట్లేనని పార్టీ నేతలు జగన్ వద్దకు క్యూ కట్టారు. ఆయన పాదయాత్రకు కూడా మంచి స్పందన రావడంతో ఇక జగన్ కు తిరుగులేదన్నారు. తమ నియోజకవర్గంలో ప్రచారానికి రావాల్సిందిగా కాళ్లావేళ్ల పడ్డారు. బతిమాలారు. అన్నా ఒక్కసారి వచ్చిపో అంటూ కూనిరాగాలు తీసిన నేతలు కూడా ఉన్నారు.
నేడు చేదుగా మారి...
అలాంటి జగన్ ఇప్పుడు అదే నేతలకు చేదుగా మారారు. కేవలం అధికారం కోల్పోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. జగన్ అధికారంలో రాకముందు కూడా ఒకటే పరిస్థితి. ఆయన కోసం, ఆయన అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాచిన నేతలు గెలిచిన తర్వాత మంత్రి పదవుల కోసమో, నామినేటెడ్ పదవుల కోసమే పైరవీలు కూడా చేసుకున్నారు. తాము తొలి నుంచి జగన్ వెంటే ఉన్నామంటూ బీరాలు పోయారు. అంతేకాదు జగన్ ను వదిలే ప్రసక్తి లేదని, తమ రాజకీయ జీవితం అంతా వైసీపీలోనే ఉంటుందంటూ భారీ డైలాగులు కొట్టారు. కానీ అలాంటి నేతలే ఇప్పుడు పార్టీ నుంచి జారుకుంటుండటం రాజకీయాల మీదనే అసహ్యం వేస్తుంది.
తప్పులు చేసినా...
వైఎస్ జగన్ సుద్దపూస అని చెప్పలేం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్‌ల కోటరీ జగన్ ను నడిపించి ఉండవచ్చు. రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లి ఉండవచ్చు. ఎవరి మాటా విని ఉండకపోవచ్చు. కొన్ని పాలనపరమైన నిర్ణయాలు విమర్శలకు గురి కావచ్చు. అయితే ఆయన బటన్ నొక్కినప్పుడల్లా పక్కన చేరి చప్పట్లు కొట్టిందెవరు? అన్నా నువ్వు సూపరంటూ పొగడ్తలతో ముంచెత్తిందెవరు? ఈ నేతలు కాదా? మంత్రి పదవి కోసం కాళ్లా వేళ్లా పడి ఆయన మంత్రివర్గంలో చేరి ఎన్నడూ తమ రాజకీయ జీవితంలో చూడని మాజీ మంత్రి అని ట్యాగ్ లైన్ ను పేరు వెనుక తగిలించుకునేలా చేసుకుందెవరు? ఇలా అనేక మంది నేతలు రాజకీయంగా ప్రయోజనాలు పొందారు.
నాడు మంచి చేస్తే...
ఎమ్మెల్యేగా ఓడిపోతే.. ఎమ్మెల్సీగా, రాజ్యసభ పదవి ఇచ్చి మరీ జగన్ తనకు నమ్మకమైన నేత అని భుజం తట్టి ప్రోత్సహించింది నిజం కాదా? కానీ నేడు వారందరికీ జగన్ విషంగా మారారా? అన్న చర్చపార్టీ కార్యకర్తల్లో జరుగుతుంది. క్షేత్రస్థాయిలో జగన్ కు జరుగుతున్న పరిణామాలన్నీ భవిష్యత్ లో మంచి చేస్తాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అన్ని రోజులూ ఒకలా ఉండవని, జగన్ పార్టీ తిరిగి పుంజుకోవడం ఖాయమన్న వార్తలు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు వెళ్లిన నేతలను ఎవరినీ రానున్న కాలంలో చేర్చుకోవద్దంటూ అప్పుడే వైసీపీ కేంద్ర కార్యాలయానికి పెద్దయెత్తున వినతులు రావడం కూడా ఇందుకు అద్దం పడుతుంది. మొత్తం మీద జగన్ కష్టకాలంలో పార్టీని వీడిన నేతలపై మాత్రం ముఖ్య క్యాడర్ లో సదాభిప్రాయం లేదన్న మాట వాస్తవం.