Vijayawada : ఈ వాహనాలు బాగుపడతాయా? రిపేరుకు ఎంతవుతుందో?

ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో వాహనాలన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి

Update: 2024-09-05 07:58 GMT

ఒక వాహనం కొనాలంటే ఎంత కష్టం.. కనీసం అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది ద్విచక్రవాహనాల వరకే. ఇక కార్ల సంగతి సరే... సరి. బెజవాడోళ్లు అంటే ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తారు. బ్రాండెడ్ కార్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండే వారిలో ఎక్కువ మంది విజయవాడవాసులే ఎక్కువ. అయితే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో వాహనాలన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని వాహనాల జాడ ఇంతవరకూ తెలియక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. వరద నీరు తగ్గినా తమ వాహనం కనిపించకపోవడంతో వాటి కోసం అంతా వెతుకులాట ప్రారంభించారు.

లక్షల సంఖ్యలో...
అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షల సంఖ్యలో వాహనాలు నీట మునిగిపోయాయి. అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇంజన్లలోకి నీరు చేరడంతో వాటిని షెడ్డుకు తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ద్విచక్ర వాహనాలను మెకానిక్ షెడ్‌లకు చేరుస్తుండటంతో విజయవాడలోని మెకానిక్ లందరూ బిజీగా మారిపోయారు. ఎంతగా అంటే ద్విచక్ర వాహనం ఈరోజు ఇస్తే కనీసం వారం రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఖర్చు ఎంతవుతుందో కూడా చెప్పలేమని, అంతా చూసిన తర్వాత ఫోన్ చేస్తామని చెప్పడంతో ఉసూరుమంటూ తమ బైకులు, స్కూటర్‌లను మెకానిక్ ల వద్దనే వదిలేసి వెళుతున్నారు.
ముందుగా అలెర్ట్ చేసి ఉంటే....?
ప్రభుత్వం తమకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఉంటే తమ ఖరీదైన కార్లను ఎగువ ప్రాంతాలకు తీసుకెళ్లి పార్క్ చేసేవారమని కార్ల యజమానులు అంటున్నారు. కానీ అలెర్ట్ లేకపోవడంతో ఎక్కడి కార్లు అక్కడే నీట మునిగాయని ఆవేదన చెందుతున్నారు. కొన్నింటికి బీమా సౌకర్యం కూడా లేకపోవడంతో ఎంత ఖర్చవుతుందో తెలియదు. మరికొన్ని వాహనాలలో విలువైన సామాన్లను దొంగలు తీసుకెళ్లారని వాపోతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న బీమా కంపెనీల యాజమాన్యంతో సమావేశం పెట్టి వారిని కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించాలని కోరారు. వీలయితే బీమా సౌకర్యం అన్ని వాహనాలకు వచ్చేలా చూడాలని కోరారు. కానీ బీమా కంపెనీలు తమ నిబంధనలను అనుసరించి వెళతాయి తప్ప అతిక్రమించి వెళ్లవని అంటున్నారు. మొత్తం మీద ఈ వాహనాల మరమ్మతుకు ఎంత ఖర్చవుతుందో కూడా తెలయని పరిస్థితి.


Tags:    

Similar News