అల్లూరి కృష్ణంరాజు కన్నుమూత

రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి

Update: 2023-07-13 03:22 GMT

రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మృతి చెందారు. 2004-2009 మధ్య కాలంలో ఆయన రాజోలు ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన 1999లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి, ఏవీ సూర్యనారాయణరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో మళ్లీ బరిలోకి దిగి సత్యనారాయణరాజుపై విజయం సాధించారు. అల్లూరి కృష్ణంరాజు భార్య ప్రస్తుతం టీటీడీ పాలకవర్గ సభ్యురాలిగా ఉన్నారు. వీరికి కుమారుడు శ్రీనివాసరాజు, కుమార్తెలు కృష్ణకుమారి, విజయ ఉన్నారు. శ్రీనివాసరాజు వ్యాపార, పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. కృష్ణంరాజు భౌతిక కాయాన్ని గురువారం సఖినేటిపల్లిలోని ఆయన నివాసానికి తీసుకురానున్నారు. మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు.

రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులు.2009 ఎన్నికల్లో తన అనుచరుడు ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు కాంగ్రెస్‌ తరుపున ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించి ఆయన విజయం సాధించేలా కష్టపడ్డారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి వైసీపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు.


Tags:    

Similar News