ఇక సామాజిక అమరావతి : సీఎం జగన్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇకమీదట సామాజిక అమరావతి అవుతుందన్నారు. ఈ అమరావతి మన అందరి అమరావతి
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా దుష్టశక్తులు ఎన్నో ప్రయత్నాలు చేశాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారన్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించామని సీఎం జగన్ పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇకమీదట సామాజిక అమరావతి అవుతుందన్నారు. ఈ అమరావతి మన అందరి అమరావతి అవుతుందని గర్వపడుతున్నానని సీఎం తెలిపారు. 25 లేఓట్లలో 50,793 మంది లబ్ధిదారులకు రూ.7 లక్షల నుండి రూ.10 లక్షల విలువ చేసే ఇళ్ల స్థలాలను అందజేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. జులై 8వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టించే కార్యక్రమాలు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ఇళ్లపట్టాల పండుగ వారంరోజులు జరుగుతుందని తెలిపారు.
నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ.. చంద్రబాబుని నమ్మలేమని సీఎం జగన్ దుయ్యబట్టారు. పేదలకు రూ.1కే టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. అన్ని అడ్డంకులు దాటి ఇప్పుడు రూ.1 రిజిస్ట్రేషన్ కే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఇస్తున్నామని.. చంద్రబాబు కనీసం పేదలకు ఒకసెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. గజదొంగల ముఠా దోచుకోవడానికే అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు.