Amaravathi : రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి అడుగు
అమరావతి రాజధాని నిర్మాణపనులకు సంబంధించి తొలి అడుగుపడింది;
అమరావతి రాజధాని నిర్మాణపనులకు సంబంధించి తొలి అడుగుపడింది. ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియన్ డెవలెప్‌మెంట్ బ్యాంకు ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసేందుకు సీఆర్డీఏకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదిహేను వేల కోట్ల రూపాయలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదిహేను వేల కోట్ల రూపాయల నిధులతో ఏ ఏ పనులు చేపాట్టాలన్నది ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో అమరావతి రాజధాని పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఈ ఉత్తర్వులను బట్టి అర్థమయిపోతుంది.
ఈ పనులు చేపట్టాలని...
ప్రధానంగా రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పించేందుకు ఈ నిధులను వెచ్చించాలని నిర్ణయించింది. దీంతో పాటు హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ ఉండేందుకు వీలయిన విధంగా నిర్మాణాలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే అమరావతిలో మురుగు నీటి కాల్వల నిర్మాణాలతో పాటు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాల్వలు నిర్మించాలని పేర్కొంది. దీంతో పాటు సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతే కాకుండా నీటి రిజర్వాయర్లను నిర్మించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.
మూడేళ్లలో పనులకు...
రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మూడేళ్లలో పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. అందులో ప్రధానంగా శాశ్వతమైన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలను నిర్మించడంతో పాటు తొమ్మిది నెలల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ లకు సంబంధించి క్వార్టర్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసి అలాట్‌మెంట్ కు రెడీ చేయాలని ఆదేశించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు ఉరుకులు, పరుగులతో ఈ పనులకు సంబంధించి ఒక క్యాలెండర్ ను రూపొందించే పనిలో ఉన్నారు. వచ్చే నెలలో ఈ పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించనున్నారని సమాచారం.