ప్రశాంత్ కిషోర్ ను లగడపాటితో పోల్చిన అంబటి
లగడపాటి బాటలోనే ప్రశాంత్ కిషోర్ కూడా.. కాన్ఫిడెన్స్ చూశారా
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటికి ప్రశాంత్ కిషోర్ I-PACకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఇది YSR కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలు, పలు ప్రచారాలను చూసుకుంది. 2019లో జగన్ గెలుపులో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాన్‌క్లేవ్‌లో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్.. జగన్ ఓడిపోతారని అన్నారు. జగన్ ప్రజలను ఆదుకుంటున్నానని భావిస్తూ ఉన్నారని.. రాజభవనంలో కూర్చుని నిధులు పంపితే ఓట్లు రావన్నారు. జగన్ భవితవ్యం కేసీఆర్ భవితవ్యంలానే ఉంటుందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడని.. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గతంలో సొంతంగా సర్వేలు చేయించిన సంగతి తెలిసిందే.. అయితే ఆయన అంచనాలు తప్పడంతో సర్వేలకు దూరమయ్యారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పొలిటీషియన్ గా మారారు. అందుకే ప్రశాంత్ కిషోర్ కూడా అదే బాటలో పయనిస్తాడన్నది అంబటి రాంబాబు అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ గెలుస్తుందని అంబటి రాంబాబు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.