Ap Cabinet : ప్రారంభమయిన కేబినెట్.. మెగా డీఎస్సీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 16,347 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొద్ది సేపటి క్రితం సచివాలయంలో ప్రారంభమయిన మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన చట్టాన్ని రద్దుపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వివిధ అంశాలకు సంబంధించి...
ఈ సమావేశంలో పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారని తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నారని చెబుతున్నారు. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నందున కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు తెప్పించుకుని, వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది