Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలను ఆమోదించనున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలను ఆమోదించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్య నిర్ణయాలపై చర్చించే అవకాశముంది. చెత్త పన్ను రద్దును ఆమోదించనున్నారు. దీంతో పాటు వరద ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ విషయంపై కూడా కేబినెట్ చర్చించి ఆమోదించనుంది. దీంతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన జరిగేలా నూతన పారిశ్రామిక విధాన ప్రణాళికపై చర్చించనున్నారు.
పెట్టుబడులు ఆకర్షించేలా...
వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా రూపొందించిన నూతన పాలసీపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించనునున్నారు. మొత్తం పది శాఖల్లో నూతన విధానాలను సిద్ధం చేశారని, చంద్రబాబు నాయుడు వరస సమీక్షలు నిర్వహించి పాలసీలు రూపొందించడంలో దిశానిర్దేశం చేశారని అధికారులు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలులోకి తెచ్చేలా కొత్త పాలసీ రూపకల్పనపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు ప్రస్తుతం తుపాను ఎఫెక్ట్ అయ్యే జిల్లాల్లో ఇప్పటికే కోటి రూపాయల నిధులు కేటాయించారు. ఆ జిల్లాల్లో రేపు తుపాను తీరం దాటే అవకాశం ఉంది కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశముంది.