Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు దిశగా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలి మంత్రి వర్గ సమావేశంలో పింఛన్లు నాలుగువేల రూపాయల పెంపుదల అంశాన్ని కేబినెట్ ఆమోదించనుంది. దీంతో పాటు ఎనిమిది శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు అవసరమైన మంత్రుల కమిటీని నియమించనున్నదని తెలిసింది.
పలు అంశాలకు...
దీంతో పాటు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించనున్నారు. గత ప్రభుత్వంలో కేటయించిన పలు భూముల విషయాన్ని కూడా మంత్రివర్గ సమావేశం పరిశీలించి చర్చించనుంది. దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు వివరించనున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, దాని పరిస్థితిపై మంత్రివర్గ సహచరులతో చర్చించి ఆదాయ వనరుల మార్గాన్ని పెంచుకునేందుకు అన్వేషించాలని కోరనున్నారని తెలిసింది. దీంతో పాటు పలు కీలక అంశాల విషయాలను కూడా మంత్రివర్గం చర్చించే అవకాశముంది.