Chandrababu : చంద్రబాబు ఏడాది తిరగకముందే ఓట్లు కొనేస్తున్నారా? ఇక వైసీపీకి గడ్డుకాలమే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయన ఏ పనిచేసినా అందులో రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయన ఏ పనిచేసినా అందులో రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది. సంక్షేమ పథకాలను ఇప్పటి వరకూ అమలు చేయలేదని సొంత పార్టీ నేతలు, క్యాడర్ లోలోపల అసంతృప్తి చెందవచ్చు. కానీ ఆయన వేసే ప్రతి అడుగు సుదీర్ఘ కాలం పాటు అధికారంలోకి ఉండటానికి బాటలు వేయడానికేనని చంద్రబాబు నాయుడును దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రతిపనిలో ఒక నిగూఢార్ధం దాగి ఉంటుంది. చంద్రబాబుకు సొంత ఆలోచనలతో పాటు ఆయనకు ప్రత్యేకంగా థింక్ బ్యాంక్ కూడా ఉంది. అందులో పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారులతో పాటు రిటైర్డ్ న్యాయమూర్తులు, మాజీ రాజకీయ నేతలున్నారు. ఆయనకు సలహాలు ఇస్తూ ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా వారు కూడా తమవంతు సాయం చేస్తారన్నది జగమెరిగిన సత్యమే.
పేదరిక నిర్మూలన కోసం...
తాజాగా ఉగాది నుంచి ప్రారంభమయ్యే పీ 4 పథకాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2029 నాటికి ఏపీలో పేదరిక నిర్మూలన తన లక్ష్యమని పదే పదే చెబుతున్నారు. వినేవారికి కొంత నవ్వు తెప్పిస్తున్నప్పటికీ అందులో ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి. ఆయన వెనక ఉన్న బలమైన శక్తులే ఆయనకు అండగా నిలుస్తారు. ముందుగా ఏపీలోని పేదలను గుర్తించి మొదటి విడత ఇరవై లక్షల కుటుంబాలు, రెండో విడత మరో ఇరవై లక్షల కుటుంబాలకు ఆర్థికంగా తో పాటు అనేక రకాలుగా సాయాన్ని అందించనున్నారు. ప్రభుత్వం పైసా ఖర్చు చేయకుండా పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, ఎన్ఆర్ఐలతో చంద్రబాబు ఈ పథకాన్ని నడిపించేయనున్నారు. వారంతా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వారికి అండగా నిలవనున్నారు. అంటే వారికి ఆర్థికంగా మాత్రమే కాకుండా వైద్యం, విద్యపరంగా కూడా వీరు సాయం అందచేయనున్నారు.
అట్టడుగున ఉన్న వారిని...
అట్టడుగున ఉన్న వారి పేదలను గుర్తించి వారికి పక్కా ఇంటిని నిర్మించడంతో పాటు వారికి అవసరమైన సహాయక సహకారాలు అందిస్తే తమకు పటిష్టమైన ఓటు బ్యాంకు ఏర్పడుతుందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఎన్నికలు ఇప్పుడే లేకపోయినా దశలవారీగా జరపాల్సిన కార్యక్రమం కావడంతో పాటు ఎన్నికల వరకూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగే అవకాశాన్ని చంద్రబాబు తనకు రాజకీయంగా అనుకూలంగా మలచుకుంటారు. దాదాపు కోటిన్నర ఓట్లను తన సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈ పీ 4 పథకాన్ని ప్రారంభించినట్లు అర్థమవుతుంది. చంద్రబాబు పిలుపుతో అనేక మంది ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు సయితం స్పందించి బడుగులకు చేయూతనందిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబాలన్ని తన ఓటు బ్యాంకుగా మారతాయన్న చంద్రబాబు ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.
ప్రభుత్వంపై భారం పడకుండా...
ఉగాది రోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పీ-4 పథకం ప్రారంభమవుతుంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రజలపై భారం పడకుండా పేదలకు అండగా నిలిచి వాటిని పసుపు పార్టీకి అనుకూలంగా మలచుకోవాలన్న ప్రయత్నంలో చంద్రబాబు సక్సెస్ అయితే మాత్రం ఇది విన్నూత్న ప్రయోగమనే చెప్పాలి. ఈ పథకం కింద గ్రామ, వార్డు సభల ద్వారా లబ్దిపొందే కుటుంబాల జాబితా రూపకల్పన చేయనున్నారు. పార్టీకి అండగా ఉంటున్న కార్యకర్తలతో పాటు న్యూట్రల్ గా ఉన్న పేదలను ఈ పథకం కింద ఎంపిక చేసే అవకాశముంది. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చంద్రబాబు చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఓట్లను పరోక్షంగా కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.