Andhra Pradesh : సూపర్ సిక్స్ కోసం జనం ఎదురు చూపులు.. జులై నెల వస్తుందిగా డేట్ ఫిక్స్ చేయరూ?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది;

Update: 2024-06-18 08:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొలి సంతకమే మెగా డీఎస్సీపై చంద్రబాబు పెట్టారు. అన్నా క్యాంటిన్లను తెరుస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. ఇలా అన్ని పనులు చేస్తున్న చంద్రబాబు వరస నిర్ణయాలతో ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయోనంటూ ప్రజలు మాత్రం ఆశతో ఎదురు చూపులు చూస్తున్నారు.

ఉచిత ప్రయాణం...
ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో మాత్రం ఎన్నికల సమయంలో చెప్పలేదు. అయితే ఇప్పటి వరకూ దానిపై ఒక క్లారిటీ రాలేదు. చంద్రబాబు ఆర్టీసీ అధికారులతో చర్చించిన తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణంపై ఒక తేదీని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీకి నష్టం రాకుండా, ఇటు ఆటో కార్మికులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష చేయాల్సి ఉంటుంది. ఉచిత ప్రయాణం భారాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించడంపై కూడా స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చంద్రబాబును కోరుతున్నారు. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశముంది.
ఉచిత సిలిండర్లు...
ఇక మూడు ఉచిత సిలిండర్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. జులై నెల నుంచే తమకు ఉచిత సిలిండర్లు అందుతాయని మహిళలు భావిస్తున్నారు. కానీ ఈ హామీ అమలుపై కూడా గ్యాస్ కంపెనీలతో చర్చించాల్సి ఉంది. వారికి నేరుగా నగదు జమ చేయడమా? లేక మహిళల ఖాతాల్లో నగదు జమ చేయడమా? అన్న స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇందుకు అధికారులతోనూ, అటు గ్యాస్ కంపెనీ ప్రతినిధులతోనూ సంబంధిత శాఖ మంత్రి సమావేశమై నివేదిక సమర్పించిన తర్వాతనే ఈ పథకం అందుబాటులో వచ్చే అవకాశముంది. జులై నెలకు ఈ పథకం కూడా అందుబాటులో వచ్చే అవకాశం లేదన్నది అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
ఈ రెండు కూడా...
మరో ముఖ్యమైన హామీ పద్దెనిమిది నెలలు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు, నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్న పథకం కూడా ఇప్పట్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన డేటా సేకరించాల్సి ఉంటుంది. అర్హతలు కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. అర్హులైన, పేదలకే ప్రభుత్వ పథకాలు అందించాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా అనుకున్న సమయానికి మాత్రం అమలు కావన్నది అధికారిక వర్గాలు చెబుతున్న మాట. మొత్తం మీద చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలవుతాయో కనీసం డేట్ చెబితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.


Tags:    

Similar News