Chandrababu : "పది"తోనే డెవలెప్‌మెంట్.. అదే చంద్రబాబు మంత్రం
పది అంశాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికను చంద్రబాబు నాయుడు రూపొందించారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కంటే ఈసారి ఒకింత భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన తన ఫోకస్ అంతా అభివృద్ధిపైనే పెట్టారు. సంక్షేమం కంటే అభివృద్ధితోనే సంపదను సృష్టించి పేదరికాన్ని తొలగించవచ్చని ఆయన విశ్వసిస్తున్నారు. అదే సమయంలో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను ఉండేలా చూడాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన ముందుకు వెళుతున్నారు. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఆయన అనేకరకాలుగా ప్రణాళికలను రచిస్తున్నారు.
రూపకల్పన చేసి...
అందులో భాగంగా పది అంశాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికను ఆయన రూపొందించారు. 2047 విజన్ డాక్యుమెట్ ను ఆయన రూపొందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ కు ఆయన రూపకల్పన చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పది అంశాలతో కూడిన ప్రణాళికలను రూపొందించారు. దేశంలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పది అంశాలు కీలకంగా మారనున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసమే ఈ పది అంశాలకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పకనే చెబుతున్నారు.
ఈ పది అంశాలు...
పేదరికం నిర్మూలన, నైపుణ్యత పంపు, రైతు సాధికారికత, తాగునీటి రక్షణ, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల వినియోగం, శక్తి వనరుల నిర్వహణ, సాంకేతిక జ్ఞానం పెంపు వంటి పది అంశాలతో ఆయన విజన్ డాక్యుమెంట్ ను రూపొందించారు. ఈ పది అంశాల్లో ప్రభుత్వం విజయం సాధించగలిగితే ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారు. అందుకోసం అధికారులను ఈ పది అంశాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ ఖజానాలో నిధులు నింపడమెలా? అని ఆలోచించిన చంద్రబాబు 2047 విజన్ డాక్యుమెంట్ తో ఏపీని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఆయన కృషి ఫలించాలని ఆశిద్దాం.