Chandrababu : హడలెత్తిస్తున్న చంద్రబాబు.. బెంబేలెత్తిపోతున్న మంత్రులు... అధికారులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాత్రం ది బెస్ట్ సీఎం అని చెప్పాల్సిందే. ఆయన శ్రమిస్తున్న తీరును అందరూ అభినందించాల్సిందే;

Update: 2024-09-25 07:07 GMT

CBN

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాత్రం ది బెస్ట్ సీఎం అని చెప్పాల్సిందే. ఎందుకంటే.. ఇప్పటికీ ఆయన శ్రమిస్తున్న తీరును అందరూ అభినందించక తప్పదు. సచివాలయానికి ఠంచన్ గా రావడం, సమీక్షలు నిర్వహించడంతో పాటు అభివృద్ధి పనులను వేగిరం పూర్తి చేయాలనన తపనతో అధికారులను పరుగులు పెట్టించడం వంటివి చూస్తే చంద్రబాబులో వయసు పెరిగినా శక్తి ఏమాత్రం తగ్గలేదని నేతలకు అర్థమయింది. యువ మంత్రులు కూడా ఆయనతో పోటీ పడలేనంతగా ఆయన శ్రమిస్తున్న తీరును చూసి వారు కూడా సచివాలయానికి వస్తూ ఎప్పుడు సీఎం నుంచి పిలుపు వస్తుందో అని భయపడి పోతున్నారు.

ఏం ప్రశ్నలు వేస్తారోనని...?
ఏ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేసి ఏమేం ప్రశ్నలు అడుగుతారోనన్న భయం ప్రతి మంత్రిలోనూ ఉందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఉన్నట్లుడి శాఖల ఉన్నతాధికారులతో పాటు సంబంధిత మంత్రులను కూడా సమీక్షలకు పిలుస్తున్నారు. ఈ సమీక్షలో కొంత క్లిష్టమైన ప్రశ్నలు చంద్రబాబు నుంచి వస్తుండటంతో దానిని సమాధానం చెప్పేందుకు మంత్రులు ముందుగానే ప్రిపేర్ అవుతున్నారట. అందుకే ఎప్పుడు సీఎంవో నుంచి పిలుపు వస్తుందో తెలియకపోవడంతో తమ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమై శాఖకు సంబంధించి పూర్తి అవగాహన చేసుకుంటున్నారని తెలిసింది. విజయవాడ వరదల సమయంలోనూ మంత్రులు, అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వగలిగారంటే ఆయనలో ఎంత పట్టుదల ఉందో చెప్పకనే తెలుస్తుంది.
చంద్రబాబుతో పోటీ పడలేక...
మరోవైపు సీనియర్ నేతల సలహాలు కూడా కొందరు యువ మంత్రులు తీసుకునేందుకు వెళుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా యనమల రామకృష్ణుడు లాంటి వారి వద్దకు వెళ్లి తమకు కొంత అవగాహన కల్పించాలని కోరుతున్నారట. చంద్రబాబు నాయుడు 18 గంటల పాటు ఇప్పటికీ పనిచేసే ముఖ్యమంత్రి. ఆయనకు అనుగుణంగా పనిచేయడానికి, అందుబాటులో ఉండేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. తమ నియోజకవర్గాలు, జిల్లాల పర్యటనలను కూడా ముందుగా సీఎంవోకు తెలిపి, అక్కడి నుంచి ఆమోదం లభించిన తర్వాతనే జిల్లా టూర్‌లను మంత్రులను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలియ వచ్చింది. ఇలా మంత్రులను చంద్రబాబు హడలెత్తిస్తున్నారు.
ఉన్నతాధికారులు కూడా...
ఇక ఉన్నతాధికారుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అధికారులు కూడా గతంలో మాదిరిగా కాకుండా సమీక్షకు వచ్చే ముందు ఒళ్లుదగ్గర పెట్టుకుని వస్తున్నారట. పూర్తిగా ప్రిపేర్ అవ్వడమే కాకుండా జిల్లా స్థాయి నుంచి కూడా సమాచారం తెప్పించుకుని మరీ చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సిద్ధంగా ఉంటున్నారట. కొందరు తడబడుతున్న అధికారులను చంద్రబాబు మందలిస్తుండటంతో ఉన్నతాధికారులు కార్యాలయంలోనే ఉండి నిత్యం శాఖలపై అధ్యయనం చేస్తూ జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ అలెర్ట్ గా ఉంటున్నారని అధకారిక వర్గాలే చెబుతున్నాయి. మంత్రుల్లో నారాయణ, పవన్ కల్యాణ్, లోకేష్ మినహా మిగిలిన మంత్రులంతా ఒకింత చంద్రబాబు సమీక్షల దెబ్బకు హడలెత్తిపోతున్నారన్నది సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News