Chandrababu Delhi Tour : రెండు రోజుల ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లేనా? త్వరలో గుడ్ న్యూస్?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేకంగా ఏపీని ఆదుకోవాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధులను విడుదల చేయాలని ఆయన కోరినట్లు తెలిసిింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గంట సేపు మోదీతో జరిగిన సమావేశంలో చంద్రబాబు అనేక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు చేసి రాష్ట్రంపై అధిక భారం మోపిందని, రుణాలకు రీ షెడ్యూల్ చేస్తే తమకు కొంత వెసులు బాటు ఉంటుందని కోరారు.
రెండు అంశాలపైనే...
అలాగే తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతలైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సత్వరం పూర్తయ్యేలా సహకరించాలని ఆయన కోరినట్లు తెలిసింది. రాష్ట్ర బడ్జెట్ లో అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయంచిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయితే.. అందుకు సంబంధించిన ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. అలాగే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుపై కూడా చంద్రబాబు మోదీతో చర్చించినట్లు తెలిసింది. గతంలో తాము అధికారంలో ఉండగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో స్థలం కేటాయించిన స్థలాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆర్థికసాయాన్ని అందించాలని...
ిఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వేగంగా పనులు పూర్తయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని ఆయన కోరారు. ప్రధానంగా నిర్వాసితులకు నష్టపరిహారం కూడా చెల్లించేందుకు ఆర్థిక సాయం అందించాలని ప్రత్యేకంగా మోదీని కోరినట్లు సమాచారం. దీంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా విడుదల చేసేందుకు అవసరమైన ఆదేశాలను జారీ చేయాలని చంద్రబాబు మోదీని కోరినట్లు సమాచారం. నదుల అనుసంధానం అయితే సంపద సృష్టి సాధ్యమవుతుందని ఆయన వివరించినట్లు చెబుతున్నారు. ఇలా ప్రతి అంశంపై మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలతో చంద్రబాబు భేటీ సక్సెస్ ఫుల్ గా ముగిసిందని, త్వరలోనే ఏపీకి గుడ్ న్యూస్ అందుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.