పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడారు. కలెక్టర్ ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు చూడటం ఎప్పుడైనా చూశారా? అని జగన్ బాధితులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉండి అన్ని సదుపాయాలు కల్పించేలా చూసుకుంటున్నారని జగన్ అన్నారు. వెంటనే ఇవ్వాల్సిన వన్నీ ఇచ్చారని, అందుకు అధికారులను జగన్ అభినందించారు. ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. 1986 లో వచ్చిన వరద ఇప్పుడు మళ్లీ వచ్చిందన్నారు. ఇంత స్థాయి మళ్లీ వరద వస్తుందని అనుకోనని అన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా సెప్టెంబరు నెలలోపు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. నాలుగు మండలాలకు రెవెన్యూ డివిజన్ ను చేస్తున్నట్లు ీఈ సందర్భంగా జగన్ ప్రకటించారు.
నష్టం ఎంత జరిగినా...
ఎవరికి నష్టం జరిగినా అందరినీ ఆదుకుంటామని చెప్పారు. ఎవరికీ ఎగ్గొట్టాలని ఈ ప్రభుత్వం చూడదని జగన్ తెలిపారు. వాలంటీర్ వ్యవస్థతో అందరికీ న్యాయం జరుగుతుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు. పథ్నాలుగు రోజుల్లో ఎన్యుమరేషన్ పూర్తయి గ్రామ సచివాలయాల్లో జాబితా పెట్టాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఎవరికైనా అందకపోతే మరో 14 రోజుల్లోపు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వం మీకోసం ఉందని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో రోజూ కుస్తీ పడుతున్నామని చెప్పారు. యుద్ధం చేస్తూనే ఉన్నామని తెలిపారు. డ్యామ్ పూర్తిగా నింపే సమయానికి అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. పరిహారం చెల్లించిన తర్వాతనే పోలవరం లో నీళ్లు నింపుతామని జగన్ తెలిపారు. పరిహారం చెల్లించిన తర్వాతనే అందరినీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.