మళ్లీ వాయిదానే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టంబరులో విశాఖకు మకాం మారుస్తామని చెప్పారు. మరోసారి వాయిదా పడినట్లు సమాచారం.

Update: 2023-09-17 07:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టంబరులో విశాఖకు మకాం మారుస్తామని చెప్పారు. ఆ విషయాన్ని ఎవరూ అడగలేదు. ఆయనే ఒక బహిరంగ సభలో ప్రకటించారు. సెప్టంబరులో తాను విశాఖలో కాపురం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అంతా నిజమేననుకున్నారు. కానీ సెప్టంబరులో సగానికి మించి రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం తాడేపల్లికే పరిమితమయ్యారు. ఆయన ఈ నెలలోనూ విశాఖ వెళ్లే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు. ఇందుకు స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ దసరాకు ఆయన షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.

మూడు రాజధానులు...
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులను శాసనసభలో ప్రకటించారు. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి ఏళ్లు గడుస్తున్నా అందుకు ముందుకు అడుగు పడలేదు. న్యాయపరమైన చిక్కులతో పాటు అనేక సమస్యల కారణంగా మూడు రాజధానుల ఏర్పాటు మాత్రం సాధ్యం ఇంతవరకూ కాలేదు. అయితే తాను మాత్రం సెప్టంబరు నెల నుంచి విశాఖలోనే ఉండనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో ముఖ్యమంత్రి నివాసం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు.
సెప్టంబరు నెలలో...
ముఖ్యమంత్రి జగన్ మాత్రమే కాదు మంత్రులు కూడా సెప్టంబరు నెలలోనే జగన్ విశాఖకు మకాం మారుస్తామని చెప్పారు. అనేక మంది మంత్రులు వరస ప్రకటనలు చేేసి ఊరించారు. కానీ ఇప్పటి వరకూ అలాంటి ఊసే కన్పించడం లేదు. సెప్టంబరు నెలలో ముఖ్యమంత్రి జగన్ విశాఖకు వచ్చే అవకాశం లేదు. ఆయన విశాఖకు వచ్చిన తర్వాత పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని భావించారు. విశాఖ నుంచే పాలన చేస్తూ అక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లాలని భావించారు. ఆ కార్యక్రమం కూడా ప్రస్తుతానికి జగన్ వాయిదా వేసుకున్నట్లు కనపడుతుంది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే కారణమని అంటున్నారు.
అనేక కారణాలు...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో పాటు రాజకీయంగా మరింత హీట్‌ పెరగడంతో తాత్కాలికంగా విశాఖ మకాంను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి పాలనను ప్రారంభించి తాను ఇచ్చిన మాటను కొంత వరకైనా నిలబెట్టుకోవాలనుకున్న జగన్ కు తరచూ ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతుంది. ఈసారి సెప్టంబరు నుంచి అక్టోబరుకు వాయిదా పడినట్లు సీనియర్ నేత ఒకరు తెలిపారు. దసరా సందర్భంగా జగన్ విశాఖకు మకాం మార్చే అవకాశముందని చెబుతున్నారు. ఇక ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. మరో ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చివరి నెలల్లో మకాం విశాఖకు మార్చినా రాజకీయంగా ప్రయోజనం ఏ మేరకు ఉంటుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News