దావోస్ పర్యటనకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అండ్ టీమ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 22 నుంచి మే 26 వరకు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్)లో ఆయన పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 22 నుంచి మే 26 వరకు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్)లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అమర్నాధ్ రెడ్డి,బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురు అధికారులు హాజరు కానున్నారు. దావోస్ పర్యటనలో నేపధ్యంలో ముఖ్యమంత్రి మూడు రాష్ట్ర స్థాయి సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. ఈ నెల 23వ తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం, 24న విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం, 25వ తేదీన డీసెంట్రలైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొననున్నారు.
డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. దావోస్ పర్యటనపై మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ వందల సంఖ్యలో కంపెనీలు దావోస్ ఎకనామిక్ ఫారమ్‌లో పాల్గొంటాయని అన్నారు. ఆ సదస్సులో కోవిడ్ ముందు ఉన్న పరిశ్రమల పరిస్థితి, కోవిడ్ తర్వాత పరిస్థితిపై చర్చ జరుగుతుందన్నారు. ఎకనామిక్ ఫోరమ్ అనేది పెద్ద కంపెనీల పారిశ్రామిక ప్రగతిపై చర్చించే వేదిక అని మంత్రి స్పష్టం చేశారు. దావోస్ పర్యటనతో వెంటనే పెట్టుబడులు రావని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంతో ముందుకు వెళ్లి ఏపీకి రావాల్సిన పెట్టుబడులుపై చర్చిస్తామని వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం మేరకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర బృందం ఈ సమావేశాలకు హాజరవుతున్నట్లు మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. ఇప్పటివరకు డబ్ల్యూఈఎఫ్‌లో మెంబర్ అసోసియేట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై ప్రతిష్టాత్మక ఫోరం ప్లాట్‌ఫాం పార్టనర్‌గా చేరనుందని, దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు.