నేడు జగన్ వారితో కీలక భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో - ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు.
జగన్ 20 నెలలకు ముందే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పటి వరకూ పాలనపై దృష్టి పెట్టారు. మొన్న గడప గడపకు ప్రభుత్వం పై వర్క్ షాప్ ను నిర్వహించిన జగన్ నేడు జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో - ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తాడపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 26 మంది జిల్లా అధ్యక్షులు, 11 మంది రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరు కానున్నారు. వారితో దాదాపు రెండు గంటలకు పైగా జగన్ సమావేశం కానున్నారు.
నియోజకవర్గాల్లో...
జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశముంది. ఎన్ని సార్లు చెప్పినా, పార్టీ పెద్దలు పరిష్కరించేందుకు ప్రయత్నించినా విభేదాలు సమసి పోవడం లేదు. దీనిపై జగన్ ఒకింత సీరియస్ గానే సమావేశంలో దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మూడేళ్ల నుంచి పార్టీ పట్టించుకోవడం లేదన్న భావనతో ఉన్న వారికి భరోసా కల్పించేలా ప్రకటన చేయనున్నారని తెలిసింది. వైసీపీలో నేడు జరగనున్న ఈ సమావేశం కీలకంగా మారబోతుందని పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.