నేడు కుప్పం నియోజకవర్గానికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలకు చేయూత పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది.
బహిరంగ సభలో....
ప్రతి ఏటా ఒక్కొక్కరికి 18,750 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తారు. ఐదేళ్లలో మొత్తం 75 వేలు నగదును జమ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా 26,39,703 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 4,949.44 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనుంది. కుప్పంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. జగన్ కుప్పం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.