Ys Sharmila : వైఎస్ షర్మిల కోరిక నెరవేరదా? అందుకు సమయం పడుతుందా?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజకీయంగా దారి తెలియడం లేదు.

Update: 2024-09-20 06:33 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజకీయంగా దారి తెలియడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పు పదవి దక్కదు. అప్పటి వరకూ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాల్సిందే. తాను రాజ్యసభ సభ్యురాలిగా వెళ్లాలని వైఎస్ షర్మిల తొలి నుంచి రాజకీయంగా అడుగులు వేశారు. ఏదో ఒక పదవి చేపట్టి వైఎస్ తనయగా తాను రాజకీయంగా సత్తాను నిరూపించుకోవాలనుకున్నారు. ముందు తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఫెయిల్ అవుతానని తెలిసి చివరకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చివరకు షర్మిల వెంట ఒక్కరే మిగిలారు. వైఎస్ షర్మిల యాటిట్యూడ్ చూసిన నేతలు ఆమె పార్టీలో చేరేందుకు కూడా సాహసించలేకపోయారు.

రాజ్యసభ పదవి దక్కుతుందని...
తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్సార్టీపీని విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి దక్కుతుందని భావించారు. అప్పట్లో కర్ణాటక నేత డీకే శివకుమార్ నుంచి హామీ లభించిందని చెబుతారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ అధినాయకత్వం వైఎస్ షర్మిలను ఏపీకి చీఫ్ గా చేసింది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. దీంతో రాజ్యసభ పదవి పై పార్టీ అధినాయకత్వం వెనక్కు తగ్గినట్లు తెలిసింది. దీంతో పాటు ఉత్తరాదికి చెందిన సీనియర్ నేతలు అనేక మంది రాజ్యసభ పదవి కోసం కాచుక్కూర్చుని ఉండటంతో వైఎస్ షర్మిలకు ఇప్పట్లో రాజ్యసభ పదవి దక్కేలా కనిపించడం లేదు.
మూడు ఎన్నికల నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో గత మూడు ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ జీరో స్థానాలకే పరిమితమయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ పార్టీ ఇక కోలుకోలేని పరిస్థితికి వచ్చింది. మరో ఎన్నికకు కూడా కాంగ్రెస్ కోలుకుంటుందని చెప్పలేం. మరోవైపు కాంగ్రెస్ ను కలుపుకుని పోయేందుకు ఏ పార్టీ కూడా భవిష్యత్ లో ముందుకు రాకపోవచ్చు. ఇటు జగన్ కాని, అటు టీడీపీ కానీ కాంగ్రెస్ ను దగ్గరకు తీసుకునే సాహసం మాత్రం చేయరు. ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పుడు ఓటు బ్యాంకు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్న రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ చీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిల రాజకీయ భవిష‌్యత్ పై నీలినీడలు అలుముకున్నాయి.
అడపా దడపా...
వైఎస్ షర్మిల కూడా అప్పుడు కూడా అడపా దడపా విజయవాడకు వచ్చి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ పీసీసీీ చీఫ్ గా తన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. దీంతో పాటు వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తుండటంతో బలమైన రెడ్డి సామాజికవర్గం కూడా ఆమె దరి చేరడానికి ఆలోచిస్తుంది. ఆమె వైెఎస్ జగన్ ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, అధికార పార్టీని వదిలేసి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత కక్షలకే రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలను వైఎస్ షర్మిల బలంగా ఎదుర్కుంటున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తప్ప వైఎస్ షర్మిలకు ఏదో ఒక పదవి దక్కేలా కనపించడం లేదు. అప్పటి వరకూ వెయిట్ చేయక తప్పదేమో?
Tags:    

Similar News