Pawan Kalyan : పవన్‌లో ఆ భయమే అక్కడకు రానివ్వలేదా? కానీ అందరూ ముక్కున వేలేసుకునేలా?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించలేదని విమర్శలు చేసే వారికి తన చేతల ద్వారా చెక్ పెట్టారు

Update: 2024-09-05 06:50 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించలేదని విమర్శలు చేసే వారికి తన చేతల ద్వారా చెక్ పెట్టారు. మొత్తం ఆరు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి ఆయన తన ఉదారతను చాటు కున్నారు. దీంతో ప్రతి పంచాయతీకి నిధులు వెళ్లి వాటి ద్వారా వరద పీడితులకు సాయం అందించేందుకు సాయపడాలని ఆయన నాలుగు కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ సొంత డబ్బులను ఇలా ఇవ్వడంపై అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలా ఎవరు చేశారంటూ నెట్టింట నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

రావడానికి ఇబ్బంది లేకపోయినా...
పవన్ కల్యాణ్ ప్రజల్లోకి రావడానికి ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు. నిజంగా ఆయన వస్తే రచ్చ అవుతుంది. బాధితులకు సాయం మాట అటుంచి అది వేరే దారి పడుతుంది. అది ఆయనకు బాగా తెలుసు. అభిమానులు తొక్కిసలాటతో అనేక సార్లు పవన్ కల్యాణ్ ఇబ్బంది పడ్డారు. ఎన్నికల సమయంలోనూ ఆయన వాహనంపైనే ఎక్కువగా ఉండి అభిమానుల నుంచి తనను తాను రక్షించుకోవాల్సి వచ్చింది. కొందరైతే వాహనాలపైకి కూడా దూకిన ఘటనలు చూశాం. అలాంటిది వరద బాధిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తే ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఆయనతో పాటు ఉండేందుకు పోటీ పడి బాధితులని కూడా చూడకుండా ఇబ్బంది పెడతారు.
సెక్యూరిటీ సమస్య...
ఆ భయమే పవన్ కల్యాణ్ ను వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించనివ్వకుండా చేసింది. దీనికి అనేక రకాలుగా పులిమి కొందరు పవన్ కల్యాణ్ తప్పించుకున్నారని, పుట్టిన రోజు వేడుకల్లో ఆయన మునిగిపోయారని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆయన వరద పీడితుల పట్ల అందరికంటే విపరీతమైన జాలి ఉందంటున్నారు. కేవలం ఆయన వస్తే సెక్యూరిటీ సమస్య తలెత్తుతుందని కూడా పోలీసులు అంగీకరించకపోవడంతోనే ఆయన కార్యాలయానికే పరిమితమయ్యారు. కార్యాలయంలో ఉండి తన శాఖలను సమీక్ష చేస్తున్నారు. నిత్యం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మాట్లాడుతూ వారిని వరద బాధిత ప్రాంతాలకు పంపుతూ సాయం అందేలా చూస్తున్నారు.
ఆయనలో మార్పు...
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది. చాలా హుందాగా మాట్లాడుతున్నారు. ముక్తసరిగా అవసరమైనంత మేరకే స్పందిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు కష్టపడుతుంటే తాను మాత్రం ఊరికే కూర్చోకుండా అవసరమైన చర్యలు ఆఫీసు నుంచే తీసుకుంటూ ఎవరూ చేయని సాయం వరద బాధితులకు చేశారంటే ఆయన ఉదారగుణం ఎంతగా ఉందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్ ను విమర్శించేందుకు కేటాయించే సమయం కంటే వరద బాధితులకు సాయం అందించడంలో వైసీీపీ నేతలు కానీ, మరెవరైనా ఆ టైంను వెచ్చిస్తే బాగుంటుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News