Pawan Kalyan : తిరుమల పర్యటనలో మాజీ సీఎం జగన్ కు ఝలక్ ఇచ్చిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేశారు నిన్న రాత్రి అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న పవన్ కల్యాణ్ ఉదయం తన ఇద్దరు కుమార్తెలతో కలసి శ్రీవారిని దర్శంచుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ దర్శనానికి వెళ్లే ముందు పవన్ సూచనతో టీటీడీ అధికారులు పవన్ బస చేసిన గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. అనంతరం తన చిన్న కుమార్తె పొలెనా అంజన పేరిట ఆయన డిక్లరేషన్ ఫారంపై సంతకం చేశారు. చిన్న కుమార్తె మైనర్ అయినందున దర్శనానికి తాను తీసుకెళుతున్నానని, స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలని కోరుతూ ఆయన సంతకాలు చేశారు. తర్వాత మాత్రమే కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన అంజనాలతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు.
తన కుమార్తెలతో కలసి...
దీంతో పవన్ కల్యాణ‌్ జగన్ కు చెక్ పెట్టినట్లయింది. ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారని, ఆయన హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడమేంటని ఎద్దేవా చేశారు. క్రిస్టియన్ అన్నా లెజినోవాను పెండ్లి చేసుకున్నందున ఆయన కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయని పవన్ తన కుమార్తెను తీసుకుని ఈరోజు డిక్లరేషన్ ఇవ్వడంతో హిందూ సంప్రదాయాలను గౌరవించినట్లు చెప్పకనే చెప్పినట్లయింది. వైసీపీ అధినేత జగన్ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పార్టీ నేతలు, మంత్రుల వరకూ డిమాండ్ చేయడంతో ఆయన తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు పవన్ డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి జగన్ ను ఇరకాటంలోకి నెట్టినట్లయింది.