Pawan Kalyan : పవన్ కొత్త నినాదంతో ఫామ్ కోల్పోతున్నారా? ఆయన ఫ్యాన్స్ ఏమంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకున్న సనాతన ధర్మ నినాదం ఆయనను రాజకీయంగా ఇబ్బందులకు తెచ్చిపెడుతునట్లే ఉంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకింత ఫామ్ కోల్పోతున్నారా? ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఏమీ చేయలేక నిరాశ నిస్పృహలో మిగిలిపోయారా? అందుకే సనాతన ధర్మం ముసుగు వేసుకుని తిరుగుతున్నారా? అన్న కామెంట్స్ ఇప్పుడు ఆయన అభిమానులనే కాదు కాపు సామాజికవర్గాన్ని కూడా వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు వరకూ పవన్ కల్యాణ్ లో కనిపించని సనాతన ధర్మం ఇప్పుడు ఒక్కసారిగా కనిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ ఘటనలు జరిగాయా? కదా? అన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం లేదు.
అప్పుడు లేనిది...
అప్పుడు రామతీర్థంలో రథం తగలపడటం వంటి ఘటనలు జరిగినా పవన్ కల్యాణ్ కు అప్పుడు సనాతన ధర్మం ఎందుకు గుర్తుకు రాలేదని, నాడు ఆ దుస్తులు ఎందుకు ధరించలేదని, ఎందుకు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టలేకపోయారన్న సందేహాలు ఆయన ఫ్యాన్స్ లో ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. ఆనాడు గుర్తుకు రాని, పాటించని సనాతన ధర్మాన్ని ఒక్కసారిగా అధికారంలోకి రాగానే ఎందుకు గుర్తుకు వచ్చిందని, విపక్షంలో చేయాల్సిన పనులు అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయా? అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. కానీ అందుకు సమాధానం చెప్పాల్సింది పవన్ కల్యాణ్ మాత్రమే. అందుకు కారణాలు కూడా ఆయనకు మాత్రమే తెలిసి ఉంటుంది.
ఎవరైనా సలహాతోనేనా?
ఒక్కసారిగా పవన్ కల్యాణ్ లో ఈ మార్పు రావడానికి కారణం ఏమై ఉంటుందా? అన్నది అర్థం కాకుండా ఉంది. ఒకవేళ పవన్ కల్యాణ్ ను వెనక నుంచి ఎవరైనా ఇలా చేయమని ప్రోత్సహిస్తున్నారా? అది రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో జరుగుతుందా? అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఈ సనాతన ధర్మం నినాదం అందుకోవడం వెనక బీజేపీ ఉందన్న కామెంట్స్ బాగానే వినపడుతున్నాయి. అయితే అందులో నిజం ఎంతో తెలియదు కానీ, దక్షిణ భారత దేశంలో బలమైన హిందుత్వ వాది తమకు అవసరం కావడంతో అందుకు పవన్ కల్యాణ్ ను వినియోగిస్తున్నారని అంటున్న వారు అనేక మంది ఉన్నారు.
కొన్ని వర్గాకు కావాలని...
కానీ బీజేపీ అలాంటి పని చేయకపోవచ్చు. బీజేపీ సొంతంగానే ఎదుగుతుంది. మరొకరి చేతిలో, మరొక పార్టీ అధినేత చేతిలో హిందుత్వ నినాదాన్ని అప్పగించి తాను తప్పుకునేంత పిచ్చిపనులు చేయదన్నది కూడా మరికొందరి వాదన. కానీ పవన్ కల్యాణ్ మాత్రం సనాతన ధర్మంతో పాటు ప్రాయశ్చిత్త దీక్ష వంటి వాటితో కొన్ని వర్గాలకు దూరమవుతున్నారన్న ఆందోళన కూడా ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతుంది. పవన్ ను అభిమానించే వారు ఈ సలహా ఎవరు ఇచ్చారన్న దానిపై ఆరాలు తీయడం మొదలు పెట్టారట. ఇది రాజకీయంగా పవన్ కు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఎంత మాత్రం చేకూర్చదన్న బలమైన వాదన మాత్రం వినిపిస్తుంది.