నేడే ఏపీలో గ్రూప్-2 ప్రిలిమ్స్
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్–2 ప్రిలిమ్స్ ను నేడు నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్–2 ప్రిలిమ్స్ ను నేడు నిర్వహించనున్నారు. గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డా.కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1,330 మంది లైజనింగ్ అధికారులను నియమించారు.
పటిష్ట బందోబస్తు:
శనివారం పరీక్షలకు సంబంధించి జవహర్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించారు. పటిష్ట బందోబస్తు కోసం 3,971 మంది పోలీస్ సిబ్బంది.. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర మెటీరియల్‌ను సురక్షితంగా తరలించేందుకు 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు.