రాధ మిస్సింగ్ కేసును విచారించేందుకు వైజాగ్ వచ్చిన ఎన్ఐఏ బృందం
మహిళ మిస్సింగ్ కేసును విచారించేందుకు వైజాగ్ వచ్చిన ఎన్ఐఏ బృందం
2017 నుంచి అదృశ్యమైన మహిళ కేసును విచారించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు జూన్ 23 (గురువారం) విశాఖపట్నం వచ్చింది. నర్సింగ్ విద్యార్థిని రాధను మావోయిస్టులు కిడ్నాప్ చేసి 2017లో ఉద్యమంలోకి బలవంతంగా చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. తమ కూతురు కిడ్నాప్‌నకు గురైందంటూ.. 2017 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని పెద్దబాయిల పోలీస్ స్టేషన్‌లో రాధ తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్నాయకులు కిడ్నాప్ చేసి, రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆమె ఆరోపించింది. సీఎంఎస్నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని ఆమె తెలిపింది. వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని రాధ తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. రాధ అదృశ్యంపై విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదవడంతోపాటు రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్ శిల్పపై ఆరోపణలున్నాయి. దీంతో నర్సింగ్ విద్యార్థిని రాధ కేసు ఎన్ఐఏకి అప్పగించారు. విశాఖలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు, విచారణ జరుపుతున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను ఎన్ఐఏ అధికారులు గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు.