వాయుగుండం.. వర్షాలు పడతాయేమోనన్న టెన్షన్

Update: 2022-12-24 04:19 GMT

ఇటీవలి కాలంలో వద్దొద్దంటున్నా వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది తూర్పు ఈశాన్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వాయుగుండం తమిళనాడులోని నాగపట్నానికి తూర్పున 570 కి.మీ.లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అదే ప్రాంతంలో నెమ్మదిగా పశ్చిమ నైరుతి దిశలో కదులుతూ రానున్న 24 గంటల్లో శ్రీలంక మీదుగా కొమరిన్ వైపు వెళుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటోంది. కోస్తా, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం చింతపల్లిలో ఈ సీజన్లోనే అత్యల్పంగా ఏడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని, చలి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News