విమనాశ్రయాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం గణనీయమైన కృషి
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను జీఎంఆర్ గ్రూప్ కంపెనీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానాశ్రయాలు, ఓడరేవుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తూ ఉంది. విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ద్వారా 27,49,835 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గత ఏడాది నవంబర్ లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంతో పోలిస్తే 2023లో రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 17.22శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం ఎయిర్‌ఫోర్స్ కు చెందింది కావడంతో రాత్రిపూట అనేక ఆంక్షలు ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆంక్షలు తొలగిపోతాయని, ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం 2025 నాటికి అందుబాటులోకి రానుంది.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను జీఎంఆర్ గ్రూప్ కంపెనీ దక్కించుకుంది. అప్పట్లో నిర్వహించిన సభలో ప్రముఖ పారిశ్రామికవేత్త, జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గ్రంధి మల్లికార్జున రావు మాట్లాతూ.. జీఎంఆర్ సంస్థ తరఫున శంషాబాద్‌లో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించానని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలను కట్టిందని.. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన చేతుల మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారని.. మళ్లీ ఆయనే ప్రారంభించారని చెప్పారు. తమ తొలి విమానాశ్రయాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కట్టి, ప్రారంభించామని, ఇప్పుడు అదే సెంటిమెంట్ ఇక్కడ కూడా కొనసాగుతుందని గ్రంధి మల్లికార్జున రావు చెప్పారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేతుల మీదుగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని కట్టబోతోన్నామని, మళ్లీ ఆయనే దీన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. శంషాబాద్‌ను మించిన స్థాయిలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ను నిర్మిస్తామని మల్లికార్జున రావు హామీ ఇచ్చారు.