Tirumala : తిరుమలలో ఇంత భక్తుల రద్దీ ఎక్కువవ్వడానికి కారణమిదేనా?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగానే ఉంది;

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. ఇక రేపటి నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటమే తప్ప తగ్గడం అనేది జరగదు. ఎందుకంటే ఏడుకొండలవాడికి అత్యంత ఇష్టమైన శనివారం నాడు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. అవసరమైతే గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చుని మరీ తమ కోరికను నెరవేర్చుకుంటారు. శనివారం అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఇంతటి ప్రాముఖ్యత శనివారానికి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఆదివారం కూడా పడనుంది.
ఇటీవల కాలంలో....
ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఇటీవల కాలంలో ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటం, వేడి గాలులు వీస్తుండటంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి మరింత తీవ్రం కాకముందే స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో దాదాపు ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది. క్యూ లైన్లు నిండిపోయాయి. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,279 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,482 భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.36 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.