Cyclone Alert : ఏపీకి మళ్లీ తుపాను.. వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. రేపు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-10-20 03:53 GMT

ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు, తుపాన్లు వీడటం లేదు. అల్పపీడనం ఏర్పడి తర్వాత వాయుగుండంగా మారుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇటీవలే ఒక వాయుగుండం తీరం దాటి సేఫ్ గా ఉండి, నష్ట తీవ్రత అంతగా లేకపోవడంతో అందరూ పీల్చుకున్నారు. ఈ సమయంలో ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉందని అధికారులు చెబుతున్నారు. మరొక ఉపరితల ఆవర్తనం అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో విస్తరించి ఉంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.

మరో అల్పపీడనం...
ఈ నెల 21వ తేదీన అంటే రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ అల్పపీడనం బలపడి ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ అక్టోబరు 23వ తేదీకి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే కాకుండా అరేబియా సముద్రం అల్పపీడనం ఏర్పడిందని చెబుతున్నారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉంటుందని అంటుననారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రధానంగా దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఏపీ సర్కార్ అలెర్ట్...
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపటి నుంచి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పునరావాస కేంద్రాలకు తరలి రావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లలో సిబ్బంది, అధికారులు కూడా సమీక్షలను నిర్వహించారు. అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

 


Tags:    

Similar News