పెరుగుతున్న గుండెపోటు మరణాలు : ఆగిన మరో రెండు గుండెలు
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల మండలం వాకావారి పాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంకొల్లు గ్రామానికి చెందిన వీరిబాబు (45)..
ఇటీవల కాలంలో నమోదవుతున్న గుండెపోటు మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎవరు, ఎప్పుడు, ఏ క్షణాన, ఏ సందర్భంలో గుండెపోటుతో మరణిస్తారో అంతుపట్టడం లేదు. ఇందుకు ఫలానా వయసువారే నన్న లెక్కలు లేవు. 10 ఏళ్లలోపు పిల్లల నుంచి వయోవృద్ధుల వరకూ.. ఎప్పుడు మృత్యువు వెంటాడుతుందో తెలీదు. ఈ క్షణమే మనది, మరుక్షణం ఎలా ఉంటుందో ప్రశ్నార్థకమే. అందుకు ఉదాహరణగా మరో రెండు గుండెలు ఆగిపోయాయి. ఏపీలో ఒకరు, తెలంగాణలో మరొకరు గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల మండలం వాకావారి పాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంకొల్లు గ్రామానికి చెందిన వీరిబాబు (45) ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం యధావిధిగా స్కూల్ కి హాజరైన ఆయన.. విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. ఎడమ ఛాతీని పట్టుకుని కుప్పకూలిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. విద్యార్థుల సమచారంతో తోటి టీచర్లు వీరిబాబును 108లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. వీరిబాబు మృతిపట్ల తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతి చెందారు.
ఇటు తెలంగాణలోనూ మరో గుండె ఆగింది. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ సోదరుడు శైలేంద్ర సింగ్ గుండపోటుతో మరణించారు. శనివారం ఉదయం ఫ్లాట్ నుంచి బయటికి వచ్చి డోర్ లాక్ చేసి, లిఫ్ట్ వద్దకు వెళ్లారు. అప్పటికే ఛాతీ భాగంలో ఇబ్బందిగా ఉన్న ఆయన.. ఎక్కువసేపు నిలబడలేక కుప్పకూలిపోయారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.